Ukraine Crisis: రష్యా ట్యాంక్‌లకు ఉక్రెయిన్‌ ఉచ్చు..!

ఉక్రెయిన్‌ ప్రతిఘటన దళాలు అందుబాటులో ఉన్న ఆయుధాలను తెలివిగా ఓ క్రమ పద్ధతిలో వాడుకొంటూ రష్యా ట్యాంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ దేశీయంగా తయారు చేసిన ఓ ఆయుధం బ్రహ్మాస్త్రం వలే పనిచేస్తోంది.

Published : 24 Mar 2022 01:36 IST

 10శాతం ట్యాంకుల ధ్వంసం.. స్టగ్నా కీలకపాత్ర

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌ ప్రతిఘటన దళాలు అందుబాటులో ఉన్న ఆయుధాలను తెలివిగా ఓ క్రమ పద్ధతిలో వాడుకొంటూ రష్యా ట్యాంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ దేశీయంగా తయారు చేసిన ఓ ఆయుధం బ్రహ్మాస్త్రం వలే పనిచేస్తోంది. నాటో సైనిక నిపుణులు కూడా ఉక్రెయిన్‌ సైన్య వ్యూహాలను అభినందిస్తున్నారు. ఈ పోరాటంలో రష్యా భారీగా సైన్యాన్ని కోల్పోవడంతోపాటు.. ఆక్రమణకు వచ్చిన వాటిల్లో దాదాపు 10శాతం ట్యాంకులను కోల్పోయింది. తూర్పు, ఈశాన్య ఉక్రెయిన్‌లో రష్యా దళాలు భారీ ఎత్తున ఆయుధాలతో విరుచుకు పడుతుండగా.. కీవ్‌, ఉత్తర ఉక్రెయిన్‌లో రష్యా దళాలు అడుగు ముందుకు కదలడం కూడా కష్టంగా మారిపోయింది. 

ట్యాంకులకు కాలం చెల్లిందా.. అనేలా..?

రష్యా సేనలు ఇప్పటి వరకు 270 ట్యాంకులను నష్టపోయినట్లు ఓరెక్స్‌ అనే ఓపెన్‌ సోర్స్‌ వెపన్స్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ సంఖ్య దాడికి వచ్చిన రష్యా ట్యాంకుల్లో 10శాతానికి సమానం. ఉక్రెయిన్‌ దళాలు విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే.. ట్యాంకులకు యుద్ధరంగంలో కాలం చెల్లిందా..? అనేలా ఉంది.  జావెలిన్‌.. ఎన్‌లా యాంటీ ట్యాంక్‌ ఆయుధాలతోపాటు మరో సైలెంట్‌ కిల్లర్‌ కూడా బాగా పనిచేస్తోంది. ఉక్రెయిన్‌ సొంతంగా తయారు చేసే ‘స్టగ్నా-పి ’ యాంటీ ట్యాంక్‌ ఆయుధం కూడా రష్యా కాన్వాయ్‌లను భారీగా దెబ్బతీసింది. చిన్నచిన్న వలంటీర్‌ గ్రూప్‌లు కూడా రష్యా ట్యాంకులను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. 

కాన్వాయ్‌లపై గురి ఇలా..!

ఉక్రెయిన్‌ మొబైల్‌ బలగాలకు స్థానిక పరిస్థితులపై మంచి పట్టు ఉంది. రష్యా బలగాల బలహీనతలను ఇవి ముందే పసిగడుతున్నాయి. కీవ్‌ వద్ద ఉన్న యాంటీ ట్యాంక్‌ ఆయుధాలను చెట్లచాటు, అపార్ట్‌మెంట్‌ కిటికీల నుంచి, బేస్‌మెంట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు. తొలుత ఎక్కువ యాంటెన్నాలతో కనిపించే కమ్యూనికేషన్‌ వాహనాలను, ఇంధన, ఇంజినీరింగ్‌, సాయుధ వాహనాలను ధ్వంసం చేయవచ్చు. మరో ప్రదేశంలో స్నిపర్‌ గన్‌తో నక్కిన మరో వలంటీర్‌ ఈ వాహనాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవచ్చు.  

ముగ్గురు వలంటీర్ల బృందం కూడా ఈ యాంటీ ట్యాంక్‌ క్షిపణులు, ఒక స్నిపర్‌ గన్‌తో ఓ కాన్వాయ్‌ను కదలనీయకుండా చేయవచ్చు. రష్యా వినియోగించే టి-72 ట్యాంకులకు సాధారణంగా పై భాగం, వెనుక భాగం బలహీనంగా ఉంటుంది. ఉక్రెయిన్‌ వద్ద ఉన్న జావెలిన్‌.. ట్యాంకులను పైనుంచి దాడి చేయగలదు. ఎన్‌లా క్షిపణికి ఇటువంటి సామర్థ్యం లేదు. రష్యా సాయుధ వాహన కాన్వాయ్‌లోని ముందు, వెనుక వాహనాలను జావెలిన్‌తో ధ్వంసం చేస్తున్నారు. ఫలితంగా కాన్వాయ్‌ నిలిచిపోతుంది. మిగిలిన సాయుధ వాహనాలను పక్క నుంచి ఎన్‌లా వంటి వాటితో ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి పలు వీడియోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. 

తెలివిగా లక్ష్యాల ఎంపిక..

ఉక్రెయిన్‌ బలగాలు తెలివిగా లక్ష్యాలను ఎంచుకొంటున్నాయి. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన రష్యా సాయుధ వాహనాలు, సైనికులకు అవసరమైన ఆయుధ, ఆహార, ఇంధన సరఫరాల కాన్వాయ్‌లపై గురిపెడుతున్నాయి. ఈ కాన్వాయ్‌లకు సాయుధ రక్షణ పెద్దగా ఉండదు.. కానీ, ఇవి ఆగిపోతే.. దేశంలోకి చొరబడిన రష్యా సైనికులకు ఆయుధ, ఇంధన, ఆహార కొరత ఏర్పడి వారు కూడా ముందుకు వెళ్లలేరు. ఉక్రెయిన్‌ అనుసరించిన ఈ వ్యూహం కారణంగా ఒక దశలో రష్యా సైనికులు ఆహారం కోసం దుకాణాలను లూఠీ చేయాల్సి వచ్చింది. దీనిని తోడు రష్యా ‘సరఫరాల ట్రక్కులు’ కూడా నిలిచిపోతున్నాయి.  ‘ఉక్రెయిన్‌ సేనలు బలహీనమైన లక్ష్యాలపై సమర్థంగా గురిపెడుతున్నాయి’ అని లండన్‌లోని రాయల్‌ యునైటెడ్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ యుద్ధతంత్ర నిపుణుడు నిక్‌ రేనాల్డ్స్‌ పేర్కొన్నారు. 

ఏమిటీ ‘స్టగ్నా-పి’ ఏటీజీఎం..?

జావెలిన్‌, ఎన్‌లా వలే ఇది కూడా యాంటీ ట్యాంక్‌ ఆయుధం. కాకపోతే ఇది ఉక్రెయిన్‌లోనే తయారవుతుంది. దీనిని కీవ్‌లోని ‘లచ్‌ డిజైన్‌ బ్యూరో’ అభివృద్ధి చేసింది. ఇది లేజర్‌ గైడెడ్‌ ఆయుధం. ఈ క్షిపణిని ఒక ట్రైపాడ్‌ పై ఉంచి.. దానిని ఎవరి కంటపడకుండా కామోఫ్లాజ్‌ చేసి.. దానికి 164 అడుగుల దూరంలో సైనికులు నక్కి రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేయవచ్చు. దీంతో ఉక్రెయిన్‌ సైన్యానికి ప్రాణనష్టం కూడా తప్పుతోంది. దీనిని ఆపరేట్‌ చేయడానికి ల్యాప్‌టాప్‌ వంటి పరికరం ఉంటుంది. ఇది ఉక్రెయిన్‌ సైన్యానికి అలవాటైన ఆయుధం కావడంతో అద్భుతంగా వినియోగిస్తున్నారు. ఇది దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు. పశ్చిమ దేశాల ఏటీజీఎంల కంటే ఈ విషయంలో స్టగ్నా మెరుగ్గా ఉంది. 

ఇటీవల ఉక్రెయిన్‌ మాజీ ఎంపీ టెటియానా చర్నోవోల్‌ కూడా ఈ ఆయుధాన్ని వాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ‘‘మేము స్టగ్నాను మార్గంవైపు గురిపెట్టి స్క్రీన్‌లో చూస్తుంటాము.. మా గురిలోకి రాగానే ఆ కాన్వాయ్‌లోని తొలి ట్యాంక్‌ను ధ్వంసం చేస్తాం. ఇందుకోసం ట్యాంక్‌లో ఇంధనం, పేలుడు పదర్థాలు నిల్వ చేసే భాగంపై గురిపెడతాం’’అని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు వీటిని వంద వరకు వాడారు. అయితే లచ్‌ డిజైన్‌ బ్యూరో వీటిని వేగంగా తయారు చేయలేకపోవడంతో ఉక్రెయిన్‌ సేనలు ఇబ్బందిపడుతున్నాయి. 

తిరగబడిన ట్యాంక్‌ల ప్లాన్‌..

యుద్ధంలో స్పష్టమైన ఆధిక్యం రాకముందే ట్యాంకులతో ఉక్రెయిన్‌ను ఆక్రమించడానికి ప్రయత్నించి రష్యా పెద్ద తప్పు చేసిందని సైనిక వ్యూహకర్తలు చెబుతున్నారు. వారి సైనికులకు ట్యాంకులను బురదలో నడిపే సామర్థ్యం లేకపోవడంతో రోడ్లపైనే పంపిస్తున్నారు. దాదాపు 40 టన్నుల బరువు ఉండే ట్యాంక్‌ గ్యాలెన్‌(3.78 లీటర్ల) ఇంధనంతో కేవలం ఒక్క మైలు ప్రయాణించగలదు. ఫలితంగా ఇంధనం నింపే వాహనాలకు ఇవి దూరంగానే నిలిచిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో సరఫరాలు లేక సిబ్బందే వీటిని ధ్వంసం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు