Zelensky: యూకే పర్యటనకు జెలెన్‌స్కీ..!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బ్రిటన్‌కు చేరుకొన్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా బ్రిటన్‌ ప్రధాని రిషిసునాక్‌తో భేటీ కానున్నారు.  

Published : 15 May 2023 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాంటి ముందస్తు ప్రకటనలు, హడావుడి లేకుండా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హఠాత్తుగా యూకే పర్యటనకు వెళ్లారు. ఆయన ఈ పర్యటనలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జెలెన్‌స్కీ ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు. కీలకమైన చర్చల కోసం మిత్రుడు రిషి సునాక్‌తో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మరింత సైనిక సాయం కోరే అవకాశాలున్నాయి.

మరోవైపు యూకే కూడా ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేసేందుకు సానుకూలంగా ఉంది. గత గురవారం ఈ మేరకు లండన్‌ నుంచి ప్రకటన వెలువడింది. రష్యా దురాక్రమణ నుంచి కాపాడుకోవడానికి ఉక్రెయిన్‌కు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. దీనిపై జెలెన్‌స్కీ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘ మా పదాతి, వాయుసేన సామర్థ్యాలను పెంచుకొనే విషయానికొస్తే యూకే పాత్ర చాలా కీలకం. ఈ సహకారం నేడు కూడా కొనసాగనుంది’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సునాక్‌-జెలెన్‌స్కీ మధ్య చర్చలు సుదీర్ఘంగా సాగే అవకాశం లేదని బ్రిటన్‌ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐరోపాలోని ప్యారిస్‌, రోమ్‌, బెర్లిన్‌ను సందర్శించిన జెలెన్‌స్కీ బ్రిటన్‌కు చేరుకొన్నారు.

మరోవైపు ఈ పర్యటనపై సునాక్‌ కూడా స్పందించారు. ‘‘మేము ఉక్రెయిన్‌ను వదిలేయం. యుద్ధంలో ఇది చాలా కీలకమైన సమయం. పుతిన్‌ యుద్ధ క్షేత్రం ఇప్పుడు ఉక్రెయిన్‌ భూభాగం లోపల ఉంది. దీని ప్రభావం ప్రపంచమంతా విస్తరించి ఉంది. ఉక్రెయిన్‌ విజయం సాధించి.. పుతిన్‌ దౌర్జన్యానికి ప్రతిఫలం దక్కకుండా చేయడమే మా లక్ష్యం’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని