Ukraine Crisis: ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!‌’

తమ దేశంపై సైనిక చర్యను మొదలుపెట్టి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో రష్యా మరో భారీ దాడికి పాల్పడే అవకాశం ఉందని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 

Published : 02 Feb 2023 19:06 IST

కీవ్‌: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా సైనిక చర్యను ప్రారంభించి ఏడాది కావస్తోంది. ఈ క్రమంలోనే రష్యా(Russia) భారీ దాడులకు సిద్ధమవుతోందని ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఓలెక్‌సీ రెజ్నికోవ్‌(Oleksii Reznikov) తెలిపారు. ఫిబ్రవరి 24 నాటికి అవి ప్రారంభమవుతాయని హెచ్చరించారు. ఈ దిశగా మాస్కో ఇప్పటికే లక్షలాది మంది సైనికులను సమీకరించిందని, సైనిక చర్యకు ఏడాది పూర్తయిన సందర్భంగా దాడులకు దిగొచ్చని చెప్పారు. ఏటా ఫిబ్రవరి 23న నిర్వహించే రెడ్‌ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవం ‘డిఫెండర్ ఆఫ్ ఫాదర్‌ల్యాండ్ డే’ గుర్తుగానూ రష్యా ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో దాదాపు 5 లక్షల మందిని మాస్కో కూడగట్టిందని తెలిపారు.

‘రష్యా.. కొత్త ఆయుధాలు, మరింత మందుగుండు సామగ్రి సమకూర్చుకుంటోంది. ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. సొంత ఉత్పత్తి కూడా పెంచుతోంది’ అని నాటో సెక్రెటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బర్గ్‌ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో.. రెజ్నికోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతోపాటు వసంతకాలం ముగిసేలోపు డాన్‌బాస్‌ను స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తన బలగాలను ఆదేశించినట్లు ఉక్రెయిన్‌ నిఘా విభాగం ఇటీవల తెలిపింది. ఈ పరిణామాల నడుమ.. ఉక్రెయిన్ కమాండర్లు ఫ్రంట్‌లైన్‌ను బలోపేతం చేయడంతోపాటు, ఎదురుదాడులకు సిద్ధం కావాలని రెజ్నికోవ్‌ సూచించారు.

మరోవైపు.. క్రమాటోర్స్క్ నగరంపై రష్యా తాజాగా జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు. దొనెట్స్క్ ప్రాంతంపై జరిపిన క్షిపణి దాడిలో.. ఓ నివాస భవనం నేలమట్టమైంది. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు. డాన్‌బాస్ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య భీకర పోరు సాగుతోందని ఉక్రెయిన్ ఉప రక్షణశాఖ మంత్రి హనా మాల్యార్ తెలిపారు. బఖ్ముత్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు యత్నిస్తున్నాయన్నారు. గతేడాది అక్టోబరులో తాము తిరిగి స్వాధీనం చేసుకున్న లీమన్‌ నగరాన్ని కూడా మరోసారి హస్తగతం చేసేందుకు మాస్కో సేనలు ప్రయత్నిస్తున్నాయని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని