Russia: రష్యా చమురు నిల్వ కేంద్రాలపై డ్రోన్ల దాడి

రష్యాలోని చమురు నిల్వ కేంద్రాలపై మంగళవారం డ్రోన్ల సాయంతో దాడి చేసింది తామేనని ఉక్రెయిన్‌ అధికారికంగా ప్రకటించింది.

Published : 19 Jun 2024 06:11 IST

తామే చేశామని ప్రకటించిన ఉక్రెయిన్‌

రష్యాలోని అజోవ్‌ జిల్లాలో చమురు కేంద్రంలో చెలరేగిన మంటలు

కీవ్‌: రష్యాలోని చమురు నిల్వ కేంద్రాలపై మంగళవారం డ్రోన్ల సాయంతో దాడి చేసింది తామేనని ఉక్రెయిన్‌ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల చాలా సందర్భాల్లో గగనతలం ద్వారానే రష్యా భూభాగంపై దాడి చేసేందుకు కీవ్‌ దళాలు మొగ్గు చూపుతున్నాయి. తాజా దాడి సైతం ఈ కోవకు చెందినదే కావడం గమనార్హం. దాడి కారణంగా చమురు రిజర్వాయర్ల వద్ద ఉవ్వెత్తున మంటలు ఎగసిపడిన క్షణాల్లోనే దాదాపు 200 అగ్నిమాపక వాహనాలతో రష్యా శ్రేణులు వాటిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని మాస్కో వర్గాలు తెలిపాయి. ‘ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎస్‌బీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక దాడి ఇది. చమురు కేంద్రంలోని రిజర్వాయర్లే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించాం’ అని ఉక్రెయిన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. 

ఉత్తర కొరియాకు చేరిన పుతిన్‌

సియోల్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం 24 ఏళ్ల తరవాత తొలిసారి ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. బుధవారం తెల్లవారుజామున ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని విమానాశ్రయంలో పుతిన్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఘనస్వాగతం పలికారు. ఉత్తర కొరియాకు బయలుదేరడానికి ముందు మంగళవారం పుతిన్‌ మీడియాతో మాట్లాడుతూ..ఉక్రెయిన్‌పై తాము చేపట్టిన సైనిక చర్యకు మద్దతిస్తున్నందుకు ఆ దేశానికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా నేతృత్వంలో తమపై విధించిన ఆంక్షలను అధిగమించడానికి తమ రెండు దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని పేర్కొన్నారు. అలాగే ఇరుదేశాలు వాణిజ్యాన్ని విస్తరించుకోవడంతోపాటు పశ్చిమ(అమెరికా మొదలైన) దేశాల నియంత్రణలేని చెల్లింపుల విధానాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని