Snake Island: స్నేక్‌ ఐలాండ్‌పై ఎగిరిన ఉక్రెయిన్‌ పతాకం

నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌పై ఎట్టకేలకు కొన్ని నెలల తర్వాత ఉక్రెయిన్‌ పతాకం ఎగిరింది. గత వారం సద్భావన చర్యగా చెబుతూ రష్యా దళాలు ఇక్కడి నుంచి వైదొలగిన విషయం

Published : 06 Jul 2022 01:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌పై ఎట్టకేలకు ఉక్రెయిన్‌ పతాకం ఎగిరింది. గత వారం సద్భావన చర్యగా చెబుతూ రష్యా దళాలు ఇక్కడి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్‌ దక్షిణ మిలటరీ కమాండ్‌ ప్రతినిధి నటాలియా హ్యూమెనియూక్‌ ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘‘ అక్కడి సైనిక చర్య పూర్తయింది. ఆ భూభాగం(స్నేక్‌ ఐలాండ్‌) ఉక్రెయిన్‌ పరిధిలోకి వచ్చింది’’ అని పేర్కొన్నారు. రష్యా దళాలను తరిమికొట్టినట్లు చెప్పారు.

శత్రువుకు మింగుడుపడని ద్వీపంగా..

మొత్తం పావు చదరపు కిలోమీటరు వైశాల్యంతో ఉన్న ఈ ద్వీపం నల్ల సముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఇది సముద్రమట్టం కంటే 41 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఉక్రెయిన్‌ ఆర్థిక కేంద్రమైన ఒడెస్సా పోర్టుకు 80 మైళ్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంపై పట్టు సాధించిన దేశం నల్ల సముద్రంలో నౌకల కదలికలపై నిఘా పెట్టే సామర్థ్యాన్ని దక్కించుకుంటుంది. మూడు శతాబ్దాల కాలంలో.. ఇది రష్యా, టర్కీ, రొమేనియా, ఉక్రెయిన్‌ చేతుల్లోకి వెళ్లింది. తాజాగా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తొలి రోజే రష్యా దళాలు ఈ ద్వీపాన్ని చుట్టుముట్టాయి. మాస్కోవా యద్ధ నౌక రంగంలోకి దిగి.. ఈ ద్వీపంపై క్రూజ్‌ క్షిపణుల వర్షం కురిపించింది. దీనిపై కట్టడాలు, లైట్‌హౌస్‌ను కూల్చివేసింది. రష్యా స్వాధీనం చేసుకొన్న అనంతరం .. అక్కడ ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ పరికరాలు, సెన్సర్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 13న మాస్కోవా నౌక స్నేక్‌ ఐలాండ్‌ సమీపంలో ప్రయాణిస్తుండగా.. రెండు నెప్ట్యూన్‌ క్షిపణులు దానిని ధ్వంసం చేశాయి. ఆ మర్నాడే దెబ్బతిన్న నౌకను క్రిమియాలోని సెవస్టపోల్‌కు తరలిస్తుండగా మునిగిపోయింది.  1788 జులై 14న తొలిసారి రష్యాకు చెందిన బ్లాక్‌సీ దళం ఈ ద్వీపం కోసం  టర్కీ చక్రవర్తి సేనలతో యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో పలు మార్లు మాస్కో-ఇస్తాంబుల్‌ చేతులు మారింది. కొన్నాళ్లు రొమేనియా చేతిలోకి వెళ్లింది. అప్పుడే ఇక్కడ అక్లిస్‌ మందిర శిథిలాలపై లైట్‌ హౌస్‌ నిర్మించినట్లు చెబుతారు. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఈ ద్వీపంపై దాడి చేసింది.  రెండో ప్రపంచ యద్ధంలో ఈ ద్వీపం కోసం సోవియట్‌-రొమేనియా మధ్య పోరు జరిగింది. ఆ సమయంలో రొమేనియా దళాలు భారీగా సీమైన్లను ఏర్పాటు చేశాయి. 1942 సమయంలో సొవియట్‌  సబ్‌మెరైన్లు కూడా ఇక్కడ మునిగిపోయాయి. 1944లో రొమేనియా ఈ ద్వీపాన్ని వదులుకోగా.. సోవియట్‌ సేనలు ఆధీనంలోకి తీసుకొన్నాయి. ఇక్కడ రాడార్‌ స్టేషన్లతో సహా పలు కట్టడాలు నిర్మించాయి. 1991 తర్వాత సోవియట్‌ పతనంతో ఇది ఉక్రెయిన్‌కు లభించింది. ఇప్పుడు మళ్లీ రష్యా చేతుల్లోకి వెళ్లి.. తిరిగి ఉక్రెయిన్‌కు దక్కింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని