UkraineCrisis: ఉక్రెయిన్‌ నల్ల సముద్ర తీరం నుంచి రష్యా నౌకలు వెనక్కి..

ఉక్రెయిన్‌ నల్ల సముద్ర తీరం నుంచి రష్యా నౌకలు దాదాపు 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ నౌకాదళం వెల్లడించింది.

Updated : 07 Jun 2022 12:46 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌ నల్ల సముద్ర తీరం నుంచి రష్యా నౌకలు దాదాపు 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ నౌకాదళం వెల్లడించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ నుంచి ఎదురయ్యే క్షిపణి, డ్రోన్‌ దాడులకు భయపడి రష్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రష్యా దళాలు క్రిమియా, ఖెర్సాన్‌ ప్రాంతంలో తీరప్రాంత క్షిపణి రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసిందని వెల్లడించింది. అయినా కానీ.. ఉక్రెయిన్‌ వైపు నుంచి క్షిపణి దాడుల ముప్పుపై రష్యా ఆందోళనగానే  ఉందని పేర్కొంది.

‘‘ఉక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా సబ్‌మెరైన్లు, నౌకల నుంచి దాదాపు 300 క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించాయి. ఇటీవల కాలంలో రష్యా కాలిబర్‌ క్షిపణులను వినియోగించడం తగ్గించింది. ఇప్పుడు భూ ఉపరితలంపై లక్ష్యాలపైకి యాంటీ షిప్‌ మిసైల్స్‌తో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే రష్యా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను వాడేసింది. ఇక ఇప్పుడు పాత క్షిపణులను వినియోగిస్తోంది’’ అని ఉక్రెయిన్‌ నౌకాదళం పేర్కొంది. 

ఉక్రెయిన్‌లోని నల్లసముద్రం తీరంలో రష్యా దాదాపు 30 నౌకలు, సబ్‌మెరైన్లను మోహరించింది. కానీ ఇప్పుడు వాటిల్లో కేవలం 12 మాత్రమే ఉన్నాయి. ఉన్న వాటిల్లో కూడా చాలా వరకూ మరమ్మతుల్లో ఉన్నాయి. నల్ల సముద్రంలో రష్యా పూర్తిగా పట్టు సాధించిందన్న వాదనను ఉక్రెయిన్‌ నౌకా దళం అంగీకరించలేదు.

మైఖలోవ్‌లో ధాన్యం టెర్మినల్‌ ధ్వంసం..

గత వారం చివర్లో రష్యా దళాలు పోర్టు సిటీ అయిన మైఖలైవ్‌పై క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడిలో ధాన్యం నిల్వ చేసే టెర్మినల్‌ పూర్తిగా ధ్వంసమైనట్లు సోషల్‌ మీడియాలో చిత్రాలు వెలువడ్డాయి. ఈ దాడిని ఐరోపా సమాఖ్య హైరిప్రజెంటేటివ్ జోసఫ్‌ బోరెల్‌ ఖండించారు. ప్రపంచ ఆహార సంక్షోభానికి రష్యా  మరింత ఆజ్యం పోసిందన్నారు. ఉక్రెయిన్‌లోనే రెండో అతిపెద్ద ధాన్యం టెర్మినల్‌ను రష్యా ధ్వంసం చేసిందని ఆరోపించారు. వాణిజ్య నౌకలకు సురక్షితమైన మార్గాన్ని ఇస్తామని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేసిన ప్రకటనకు దాడి పూర్తిగా భిన్నంగా ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని