Ukraine: ఉక్రెయిన్‌ భవనాలపై మిస్టరీ గుర్తులు.. రష్యా టార్గెట్‌లేనా..?

ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లోని భవనాలపై వెలుగు చూస్తోన్న ప్రత్యేక గుర్తులు మిస్టరీగా మారాయి. ముఖ్యంగా అవి రష్యా దాడులు చేసేందుకు పెడుతోన్న టార్గెట్‌లుగా అనుమానిస్తున్నారు.

Published : 02 Mar 2022 01:15 IST

పౌరులను అప్రమత్తం చేస్తోన్న అధికారులు

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్య రోజురోజుకు తీవ్రతరమవుతోంది. భీకర దాడులకు తెగబడుతోన్న రష్యా సేనలు.. సామాన్య పౌరులపైనా దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లోని భవనాలపై వెలుగు చూస్తోన్న ప్రత్యేక గుర్తులు మిస్టరీగా మారాయి. ముఖ్యంగా అవి రష్యా దాడులు చేసేందుకు పెడుతోన్న టార్గెట్‌లుగా అనుమానిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఉక్రెయిన్‌ అధికారులు, ఎత్తైన భవనాలు, సమూహ నివాసాలపై ఏమైనా ప్రత్యేక గుర్తులు కనిపించినట్లయితే వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని సూచిస్తున్నారు.

రష్యా సైన్యం చేపట్టిన దురాక్రమణ ఆరో రోజుకు చేరుకుంది. ఇప్పటికే పలు నగరాల్లోకి ప్రవేశించిన రష్యా సేనలకు ఉక్రెయిన్‌లో కొందరు సహకరిస్తున్నారనే అనుమానాలను అక్కడి అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కీవ్‌ నగరంలో చాలా భవనాలపై ఎరుపురంగులో X అనే గుర్తులు ఉండడం వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో కీవ్‌ భవనాలపై అటువంటి గుర్తులేమైనా ఉన్నాయా అని వెంటనే పరీక్షించుకోవాలంటూ ఉక్రెయిన్‌ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ అటువంటి గుర్తులు కనిపిస్తే వెంటనే వాటిని కప్పివేయడం లేదా సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలని సూచిస్తున్నారు.

కీవ్‌లోనే కాకుండా మరో నగరమైన రీవ్నేలోనూ ఇటువంటి గుర్తులే కనిపిస్తున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. నివాస భవంతులపై ఏమైనా ప్రత్యేక గుర్తులు కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు తెలియజేయాలని రీవ్నే మేయర్‌ అలెగ్జాండర్‌ ట్రెట్యాక్‌ వెల్లడించారు. అంతేకాకుండా అనుమానితులు ఎవరైనా కనిపించినా వెంటనే భద్రతా బలగాలకు చెప్పాలన్నారు.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతోన్న రష్యాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా రష్యాపై పలు విధాలుగా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రష్యా మాత్రం బెదరడం లేదు. వాటికి ప్రతిదాడిగా రష్యా కూడా ఇతర దేశాలపై ఆంక్షలకు సిద్ధమవుతుండడం గమనార్హం. మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన తొలిదఫా శాంతి చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని