Modi-Putin: పుతిన్‌తో మోదీ ఆలింగనం.. తీవ్రంగా స్పందించిన జెలెన్‌స్కీ

Modi-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోదీ భేటీ అవడంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి దెబ్బే అని అన్నారు.

Updated : 09 Jul 2024 13:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ప్రధాని నరేంద్రమోదీ (Modi Russia Visit) రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ఆయనకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. వీరిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ పరిణామాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ (PM Modi) భేటీ తమను నిరాశపర్చిందన్నారు.

‘‘ఉక్రెయిన్‌ (Ukraine)లో సోమవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. 13 మంది పిల్లలు సహా 170 మంది గాయపడ్డారు. ఆ వెంటనే మరో చిన్నారుల ఆసుపత్రిపై రష్యా క్షిపణి విరుచుకుపడింది. ఎంతోమంది శిథిలాల కింద సమాధి అయ్యారు. అలాంటి రోజున ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నాయకుడు (మోదీని ఉద్దేశిస్తూ).. ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్థుడిని (పుతిన్‌ను ఉద్దేశిస్తూ) మాస్కోలో ఆలింగనం చేసుకున్నారు. ఇది తీవ్ర నిరాశ కలిగించింది. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బ లాంటిదే’’ అని జెలెన్‌స్కీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో రాసుకొచ్చారు. రష్యా దాడికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి.. మోదీతో విందులో పుతిన్‌ నిర్ణయం

రష్యాలో మోదీ పర్యటన సమయంలోనే ఉక్రెయిన్‌పై మాస్కో క్షిపణుల వర్షం కురిపించింది. ఐదు నగరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. మొత్తం 40 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో అనేక అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు కూలిపోయాయని జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) తెలిపారు.

ఇదిలాఉండగా.. రష్యా అధ్యక్షుడితో భేటీ (Modi Putin Meet) సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని మోదీ ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్‌ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవు. చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలు’’ అని భారత ప్రధాని పుతిన్‌కు సూచించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని