Ukraine Crisis: ఆ ఉక్రెయిన్‌ నగరానికి కలరా ముప్పు.. హెచ్చరించిన బ్రిటన్‌ రక్షణ శాఖ

సైనిక చర్య పేరిట రష్యా చేపడుతోన్న దాడులతో ఉక్రెయిన్‌ నగరాలు అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే. మౌలిక సదుపాయాలు దెబ్బతిని.. కొన్నిచోట్ల పౌరులకు కనీసం శుభ్రమైన తాగునీరు లభించని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే...

Published : 10 Jun 2022 15:21 IST

కీవ్‌: సైనిక చర్య పేరిట రష్యా చేపడుతోన్న దాడులతో ఉక్రెయిన్‌ నగరాలు అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే. మౌలిక సదుపాయాలు దెబ్బతిని.. కొన్నిచోట్ల పౌరులకు కనీసం శుభ్రమైన తాగునీరు లభించని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓడరేవు నగరమైన మేరియుపొల్‌లో తీవ్రస్థాయిలో కలరా ప్రబలే ప్రమాదం ఉందని బ్రిటన్‌ రక్షణశాఖ తన తాజా నివేదికలో హెచ్చరించింది. ఈ నగరంలో వైద్య సదుపాయాలు ఇప్పటికే కుప్పకూలే దశకు చేరుకున్నట్లు పేర్కొంది. ఖేర్సన్‌లోనూ ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

‘ఉక్రెయిన్‌లో తన గుప్పిట ఉంచుకున్న ప్రాంతాల్లోని పౌరులకు కనీస సౌకర్యాలు అందించేందుకు రష్యా ఇబ్బందులు పడుతోంది. టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. పౌరులకు సురక్షిత తాగునీరు సరిగ్గా అందుబాటులో లేని పరిస్థితి. మేరియుపోల్‌లో వైద్య సేవలు ఇప్పటికే పతనావస్థకు చేరువగా ఉన్నాయి. స్థానికంగా తీవ్రస్థాయిలో కలరా ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. మే నుంచి ఇక్కడ కలరా కేసులు బయటపడుతున్నాయి. మరోవైపు ఖేర్సన్‌లో తీవ్రస్థాయి మందుల కొరత ఏర్పడే అవకాశం ఉంది’ అని బ్రిటన్‌ తన నివేదికలో పేర్కొంది.

ఉక్రెయిన్‌ ఇదివరకు 1995లో అతిపెద్ద కలరా విపత్తును ఎదుర్కొంది. అప్పటినుంచి అడపాదడపా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అజోవ్‌ సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మేరియుపొల్ ఈ తీరాన్నే ఆనుకుని ఉంది. ఇదిలా ఉండగా.. డాన్‌బాస్‌ ప్రాంతంలోని సీవీరోదొనెట్స్క్‌లో ఇరుపక్షాల మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోందనీ బ్రిటన్ తన నివేదికలో తెలిపింది. చాలావరకు నగరం మాస్కో నియంత్రణలో ఉన్నప్పటికీ.. నగరాన్ని చుట్టుముట్టే క్రమంలో రష్యన్‌ సేనలు స్వల్పపాటి పురోగతి మాత్రమే సాధించాయని వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని