FTA: ఎన్నో దీపావళి పండగలు వచ్చిపోయాయి కానీ..: బ్రిటన్‌ నేత వ్యాఖ్య దేని గురించి అంటే..?

భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారు కాకపోవడంపై బ్రిటన్ విపక్షం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేసింది. 

Published : 25 Jun 2024 14:04 IST

లండన్‌: ఎంతోకాలంగా చర్చల దశలో ఉన్న భారత్‌-బ్రిటన్(India-Britain)ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) ఒక కొలిక్కి రాకపోవడంపై బ్రిటన్‌లోని విపక్షం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. అధికార కన్జర్వేటివ్‌ పార్టీతో పాటు ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై లేబర్ పార్టీకి చెందిన డేవిడ్ లామీ విమర్శలు గుప్పించారు.

‘‘వాణిజ్య ఒప్పందం లేకుండానే ఎన్నో దీపావళి పండగలు వచ్చి పోయాయి. ఎన్నో వ్యాపారాలు ఈ ఒప్పందం కోసం వేచిచూస్తున్నాయి. మా పార్టీ భారత్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. ఆ దేశం ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో సూపర్‌ పవర్‌. ఆ దేశంలో అపరిమితమైన అవకాశాలున్నాయి’’ అని అన్నారు. ఈ ఒప్పందాన్ని పూర్తి చేసుకొని, రెండు దేశాలు పరస్పరం ముందుకుసాగాలని ఆకాంక్షించారు. జులై నాలుగున జరిగే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఒప్పందానికి సిద్ధమని, అన్నీ అనుకూలంగా జరిగితే ఆ నెల చివరివారంలో తాను దిల్లీలో పర్యటించొచ్చని ధీమా వ్యక్తంచేశారు. అలాగే భారత్‌తో బంధం విషయంలో మా దేశంలోని అధికార పార్టీ హామీలు గొప్పగా ఉన్నాయని, చేసింది మాత్రం తక్కువని నిందించారు.

ఎఫ్‌టీఏ(FTA) చర్చలు 2022 జవవరిలో ప్రారంభం కాగా.. అదే ఏడాది దీపావళికి ఒప్పందంపై ఒక కొలిక్కి రావాలని అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ గడువు విధించారు. కానీ అనుకున్న ప్రకారం అది జరగలేదు. తర్వాత టోరీ ప్రధాని రిషి సునాక్‌ నేతృత్వంలో కొత్తగా డెడ్‌లైన్ ఏదీ విధించలేదు కానీ.. ఆ ఒప్పందం ఖరారు దిశగా చర్చలు సాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఇప్పటికే 36 బిలియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్ల విలువ చేసే ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుంది. దాన్ని మరింత విస్తరించేందుకు ఎఫ్‌టీఏ ఒప్పందం కీలకం కానుంది. ఎఫ్‌టీఏలో భాగంగా వస్తువులకు సుంకం మినహాయింపుతో పాటు ఐటీ, హెల్త్‌కేర్‌ రంగాల్లో ఎక్కువ అవకాశాలను భారత్‌ ఆశిస్తోంది. అదే సమయంలో స్కాచ్‌ విస్కీ, ఆటోమొబైల్స్‌, గొర్రె మాంసం, చాక్లెట్లు వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకంపై యూకే మినహాయింపులు కోరుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని