Ukraine Crisis: ఉక్రెయిన్‌ రక్తపాతానికి ముగింపు పలకాల్సిందే : ఐరాస

ఉక్రెయిన్‌లో కొనసాగుతోన్న రక్తపాతానికి ముగింపు పలికేలా ప్రపంచదేశాలు ఏకం కావాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు.

Published : 06 May 2022 19:27 IST

ప్రపంచ దేశాలకు ఐరాస చీఫ్‌ పిలుపు

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై గడిచిన రెండు నెలలకు పైగా  కొనసాగిస్తోన్న దాడులను రష్యా మరింత ఉద్ధృతం చేస్తోంది. రష్యా చేస్తోన్న భీకర దాడుల్లో వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఉక్రెయిన్‌లో కొనసాగుతోన్న రక్తపాతానికి ముగింపు పలికేలా ప్రపంచదేశాలు ఏకం కావాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు. ప్రపంచానికి హాని కలిగించే ఇటువంటి యుద్ధం అర్థంలేనిది, క్రూరమైనదని అన్నారు. కనీసం ఒక్కరోజైనా కాల్పుల విరమణ చేస్తే డజన్ల కొద్ది పౌరుల ప్రాణాలను కాపాడుకోవడంతోపాటు వందల సంఖ్యలో ఉక్రెయిన్‌ వాసులు గాయాలపాలు కాకుండా రక్షించుకోవచ్చని ఐరాస చీఫ్ స్పష్టం చేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ సందర్భంగా ఆయనతో పదాల గారడి చేయలేదని.. ఉక్రెయిన్‌, రష్యాతోపాటు యావత్‌ ప్రపంచం కోసం ఈ యుద్ధానికి ముగింపు పలకాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు గుటెరస్‌ వెల్లడించారు. అంతేకాకుండా సాధ్యమైనంత త్వరగా ఆహారం, విద్యుత్‌ వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచాలనే విషయాన్ని ఇరు దేశాల నాయకులకు సూచించానన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇప్పటివరకు 6,731 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ మిషెల్లీ బచాలెట్‌ అంచనా వేశారు. ఇటువంటి ఉద్రిక్తతల సమయంలో కనీసం ఒక్కరోజు కాల్పుల విరమణ పాటించినా నిత్యం 50 మంది ప్రాణాలు కాపాడుకోవచ్చని మిషెల్లీ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న మారణకాండ 72వ రోజుకు చేరుకుంది. ఈ భీకర దాడుల్లో ఇప్పటివరకు రష్యా వైపు దాదాపు 24వేల మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ పేర్కొంటోంది. మరోవైపు ఉక్రెయిన్‌ వైపు ఏడువేల మంది పౌరులు చనిపోగా సైన్యాన్ని కూడా భారీగానే కోల్పోయినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇలా వేల సంఖ్యలో ప్రాణనష్టానికి కారణమవుతోన్న రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపేందుకు ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఐరాస పిలుపునిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని