Published : 25 Jun 2022 01:40 IST

Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్‌ హెచ్చరిక

బెర్లిన్‌: ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ (Antonio Guterres) తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రపంచంలో పెరుగుతున్న ఆహారం కొరత (food shortage) కారణంగా మున్ముందు ప్రపంచ దేశాలు తీవ్ర విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం బెర్లిన్‌లో జరిగిన సదస్సులో సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాగా.. ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గుటెర్రెస్‌ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, పెరుగుతున్న అసమానతల కారణంగా ఇప్పటికే కోట్ల మంది ప్రజలు ప్రభావితం కాగా.. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసిందన్నారు. 2022లో మరిన్ని కరవు కాటకాలు సంభవించే అవకాశం ఉందని.. 2023 ఏడాది కూడా ఘోరంగా ఉండొచ్చని హెచ్చరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఇంధన ధరలు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో పంటలు దెబ్బతింటాయని గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆహార లభ్యతలో ఏర్పడే సమస్యలు వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు దారితీయొచ్చన్నారు. ఇలాంటి విపత్తులతో సంభవించే సామాజిక, ఆర్థిక ప్రభావం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదని గుటెర్రెస్‌ పేర్కొన్నారు. పేద దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్ని నిలబెట్టుకొనేలా, ప్రపంచ ఆహార మార్కెట్లను స్థిరీకరించేందుకు దోహదం చేసేలా ప్రైవేటు రంగానికి రుణ ఉపశమనం కలిగించాలని పిలుపునిచ్చారు.

మరోవైపు, ఉక్రెయిన్‌పై దండయాత్ర చేసిన రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలే ఆహార కొరతకు కారణమంటూ మాస్కో చేస్తోన్న వాదనల్ని జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్‌ తిరస్కరించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో రష్యా గోధుమలను ఎగుమతి చేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సంక్షోభం పెరగడానికి అనేక అంశాలు కారణమంటూ గుటెర్రెస్‌ వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts