Burkina Faso : దయనీయం.. ఆకులు, ఉప్పు తింటూ అక్కడి జనం బతుకుతున్నారు!

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని.. అక్కడ కొన్నిచోట్ల మహిళలు, చిన్నారులు కొంత కాలంగా ఆకులు, ఉప్పు తింటూ జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 22 Oct 2022 01:41 IST

వాగడూగు (బుర్కినా ఫాసో): ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్రికాలోని పలు దేశాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తంచేసింది. అక్కడ కొన్నిచోట్ల మహిళలు, చిన్నారులు కొంత కాలంగా ఆకులు, ఉప్పు తింటూ జీవనం సాగిస్తున్నారని ఆందోళన చెందింది. బుర్కినా ఫాసోలో ఇటీవల పర్యటించిన ఐరాసలోని మానవతా వ్యవహారాలు, అత్యవసర సహాయ విభాగం సమన్వయకర్త మార్టిన్‌ గ్రిఫిత్స్‌.. అక్కడి పరిస్థితులు తనను ఎంతగానో కలచివేశాయని చెప్పారు.

‘చాలా ప్రాంతాల్లోని ప్రజల్లో పెరుగుతోన్న అభద్రతాభావం కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో తెగతెంపులు చేసుకున్నాయి. తద్వారా చాలా ప్రాంతాలు ఆకలి కేకలతో అల్లాడుతున్నాయి. సహాయం చేసేందుకు వెళ్లే వారికి అక్కడికి చేరుకోవడం చాలా ఇబ్బందిగా మారింది’ అని మార్టిన్‌ గ్రిఫిత్స్‌ పేర్కొన్నారు. రెండు కోట్ల జనాభా కలిగిన బుర్కినా ఫాసోలో సుమారు 50లక్షల మందికి అత్యవసర సహాయం అవసరమని అంచనా వేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో డిజిబో నగరంలో ఇటీవల పోషకాహార లోపంతో ఎనిమిది మంది మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆ నగరంలో 3,70,000 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఆహార ధరలు పెరగడంతోపాటు నీరు కూడా లభ్యం కావడం లేదని అక్కడ సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.

‘మాకు తిండి దొరకడం లేదు. కేవలం ఆకులమీదే ఆధారపడ్డాం’ అని డిజిబో పట్టణానికి చెందిన డవుడా మైగా అనే వ్యక్తి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని హెలికాప్టర్ల ద్వారా సహాయం అందుతోందని.. కానీ, అవి సరిపోవడం లేదని వాపోయారు. రోడ్డు మార్గంలో పట్టణంలోకి వెళ్లేందుకు యత్నించే కాన్వాయ్‌లు దాడులకు గురికావడం సహాయ చర్యలకు ఇబ్బందిగా మారినట్లు సమాచారం.

అల్‌ఖైదాతోపాటు ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌లతో బుర్కినా ఫాసో కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ ఘర్షణలు.. వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి. వరుస దాడులతో దాదాపు 20లక్షల మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. దీంతో అభద్రతా భావంతో ఉన్న పలు ప్రాంతాల ప్రజలు తమ పట్టణాలను నిర్బంధించుకోవడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని