UN Reform: యూఎన్‌ఎస్‌సీ నిజమైన వైవిధ్యతను కనబర్చడం లేదు : భారత్‌

సంస్కరణలకు ఐరాస దూరంగా ఉండిపోయిందని.. ఐరాస భద్రతామండలి(UNSC) నిజమైన వైవిధ్యతను కనబర్చడం లేదని భారత్‌ ఆక్షేపించింది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు శాశ్వత స్థానం లేకపోతే దాని విశ్వసనీయత ప్రమాదంలో పడుతుందని ఉద్ఘాటించింది.

Updated : 12 Dec 2022 11:08 IST

జెనీవా: ఐరాస భద్రతామండలి(UNSC) నిజమైన వైవిధ్యతను కనబర్చడం లేదని భారత్‌ ఆక్షేపించింది. ఐరాస కూడా సంస్కరణల(UN Reforms)కు దూరంగా ఉండిపోయిందని తాజాగా పేర్కొంది. ఉగ్రవాదం, మహమ్మారుల విజృంభణ, సాంకేతికతల దుర్వినియోగం తదితర సవాళ్లతోపాటు భౌగోళిక రాజకీయ రంగంలో ఆధిపత్య పోరు వంటివి తీవ్రతరమవుతోన్న వేళ.. శాంతి స్థాపనకు బలమైన వేదిక, బహుముఖ ప్రతిస్పందన అవసరమని పిలుపునిచ్చింది. నెలవారీ రొటేటింగ్‌ విధానంలో 15 సభ్యదేశాల యూఎన్‌ఎస్‌సీకి ప్రస్తుతం భారత్‌ అధ్యక్షత వహిస్తోంది.

ఈ క్రమంలోనే డిసెంబరు 14, 15వ తేదీల్లో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ అధ్యక్షతన ఐరాసలో కీలక కార్యక్రమాలు నిర్వహించనుంది. బహుముఖవాదం, ఉగ్రవాదం కట్టడిపై ప్రధానంగా దృష్టి సారించనుంది. దీనికి సంబంధించిన విషయాలపై భద్రతా మండలిలో చర్చలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సమావేశాలకు ముందు భారత్‌ ఈ మేరకు ఓ కాన్సెప్ట్‌ నోట్‌ను విడుదల చేసింది. దీన్ని భద్రతా మండలి పత్రంగా పంపిణీ చేయాలని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌కు సూచించింది.

‘ఇప్పుడు ప్రపంచం 77 ఏళ్ల క్రితం మాదిరిగా లేదు. మొదట్లో 55 సభ్య దేశాలు ఉండగా.. ఇప్పుడు మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచ శాంతి, భద్రతలకు బాధ్యత వహించే ఐరాస భద్రతా మండలి కూర్పు చివరిసారి 1965లో చేపట్టారు. ఇది ఐరాస విస్తృత సభ్యత్వపు నిజమైన వైవిధ్యాన్ని ప్రతిబింబించడం లేదు’ అని కాన్సెప్ట్ నోట్‌లో పేర్కొంది. ఐరాస సంస్కరణల ఫ్రేమ్‌వర్క్‌పై సభ్య దేశాల నుంచి అనేక ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. ఈ విషయంలో పురోగతి లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు శాశ్వత స్థానం లేకపోతే దాని విశ్వసనీయత ప్రమాదంలో పడుతుందని ఉద్ఘాటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని