Taliban: ఆ ఇద్దరి ఆచూకీపై సమాచారం ఇవ్వండి.. తాలిబన్లకు ఐరాస విజ్ఞప్తి

తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కుల విషయమై పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. వారిపై ఇంటాబయట ఆంక్షలు విధిస్తూ.. ఎదిరిస్తే కఠినంగా అణచివేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అఫ్గాన్‌...

Published : 23 Jan 2022 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కుల విషయమై పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. వారిపై ఇంటా బయట ఆంక్షలు విధిస్తూ.. ఎదిరిస్తే కఠినంగా అణచివేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లో ఇద్దరు మహిళా కార్యకర్తలను ఇంటినుంచి అపహరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఐరాస శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారి ఆచూకీ గురించి వెంటనే సమాచారం అందించాలని తాలిబన్లను కోరింది. బుధవారం నుంచి ఆ మహిళా కార్యకర్తలు కనిపించకుండా పోయారని అఫ్గాన్‌లోని ఐరాస సహాయ మిషన్ (యూఎన్‌ఏఎంఏ) ట్విటర్‌లో పేర్కొంది.

‘ఇద్దరు అఫ్గాన్‌ మహిళా కార్యకర్తలు.. తమనా జర్యాబీ పర్యానీ, పరవానా ఇబ్రహీంఖేల్ బుధవారం రాత్రికి రాత్రే వారి ఇళ్ల వద్ద నుంచి అపహరణకు గురికావడం ఆందోళనకరం. వారి ఆచూకీ తెలపాలని, దీంతోపాటు అఫ్గాన్‌వాసుల హక్కులను కాపాడాలని తాలిబన్లను కోరుతున్నాం’ అని యూఎన్‌ఏఎంఏ శనివారం ట్వీట్ చేసింది. అయితే, తమనా జర్యాబీతోపాటు దాదాపు 25 మంది మహిళలు.. ఇటీవల తాలిబన్లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో పాల్గొన్నారని ఓ వార్తాసంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె అదృశ్యమవడం గమనార్హం. గతేడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. స్థానికంగా తమదైన పాలన సాగిస్తోన్న విషయం తెలిసిందే! మొదట్లో కొత్త ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలంటూ, తమ హక్కులను కాపాడాలంటూ మహిళలు ఆందోళనలకు దిగినా.. అణగదొక్కారు. ప్రస్తుతం ఈ దేశం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆకలి కేకలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం ముస్లిం దేశాలైనా ముందుకు వచ్చి తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని ప్రధాని మొహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ ఇటీవల విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని