Israel Hezbollah: బ్లూ లైన్‌లో యుద్ధ మేఘాలు.. ఐరాస తీవ్ర ఆందోళన

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దులో చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 06 Jul 2024 18:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌- లెబనాన్‌ (Israel- Lebanon) సరిహద్దులో (బ్లూ లైన్‌) (Blue Line) యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. టెల్‌అవీవ్‌ సైన్యానికి, లెబనాన్‌లోని హెజెబొల్లా (Hezbollah) మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి (UNO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘పూర్తి స్థాయి యుద్ధం’ చోటు చేసుకునే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐరాస శాంతిపరిరక్షణ దళాలను కీలక ప్రదేశాలకు తరలించినట్లు తెలిపారు. ఈ దళంలో భారత్‌కు చెందిన 901 మంది సైనికులు ఉన్నారు. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు వర్గాలు అడుగులు వేయాలని, లేదంటే భారీగా ప్రాణనష్టం సంభవించే అవకాశముందని ఐరాస హెచ్చరించింది.

హెజ్‌బొల్లా గ్రూప్‌ సీనియర్‌ కమాండర్‌ మహ్మద్‌ నామేహ్‌ నజీనర్‌ను.. వైమానిక దాడిలో ఇజ్రాయెల్‌ హతమార్చింది. దీనికి ప్రతీకారంగా.. ఆ దేశ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని హెజ్‌బొల్లా బుధవారం 100 రాకెట్లను ప్రయోగించింది. వాటన్నింటినీ టెల్‌అవీవ్‌ సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం ఒక్కసారిగా వేడెక్కాయి. ఇజ్రాయెల్‌పై దాడులు ఆపే ప్రసక్తే లేదని హెజ్‌బొల్లా తెగేసి చెబుతోంది. హమాస్‌కు మద్దతుగా తమ పోరాటం కొనసాగుతుందని అంటోంది. గాజాలో కాల్పుల విరమణ జరిగే వరకు దాడులు కొనసాగిస్తామంటోంది. ఇరాన్‌ పూర్తి స్థాయిలో మద్దతు పలకడంతో ఆ గ్రూప్‌ మరింత బలపడింది. టెల్‌ అవీవ్‌ సహా ఇజ్రాయెల్‌లోని అన్ని నగరాలపై బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించగలిగే స్థితిలో ఉంది. ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థను ఛేదించగల స్థాయిలో దాదాపు లక్ష రాకెట్లు, ఆత్మాహుతి డ్రోన్లు హెజ్‌బొల్లా వద్ద ఉన్నాయని అమెరికా భావిస్తోంది. ఒక దేశం స్థాయిలో హెజ్‌బొల్లా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంది. 

ఆందోళనలో ప్రజలు

ఇజ్రాయెల్‌,  లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ మధ్య యుద్ధ వాతావరణం నెల కొనడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లెబనాన్‌కు చెందిన సుమారు 60 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి అంటోని బ్లింకెన్‌ తెలిపారు. మరోవైపు హెజ్‌బొల్లా నుంచి కూడా దాడులు ఉద్ధృతం కావడంతో ఇజ్రాయెల్‌ సరిహద్దులోని 20 వేల మంది ఇళ్లను వదిలి వెళ్లిపోయినట్లు చెప్పారు. కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడం సాధ్యపడుతుందన్నారు.

ఐరాసా మద్దతు కోరిన లెబనాన్‌

లెబనాన్‌-ఇజ్రాయెల్‌ సరిహద్దులో తరచూ ఉద్రిక్తతలు నెలకొనడంతో ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్‌ 49 దేశాలకు చెందిన 10 వేల మందితో శాంతి పరిరక్షక దళాన్ని (యూఎన్‌ ఇంటెర్మ్‌ ఫోర్స్‌ ఇన్‌ లెబనాన్‌-UNIFIL) ఏర్పాటు చేసింది. వీరంతా లెబనాన్‌ జాతీయ భద్రతాదళంతో కలిసి పని చేస్తూ.. సరిహద్దులో శాంతిని పరిరక్షిస్తుంటారు. ప్రస్తుతం ఈ దళంలో భారత్‌కు చెందిన 901 మంది సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో శాంతి పరిరక్షణకు తోడ్పాటు అందించాలని ఐరాసను లెబనాన్‌ విదేశీ వ్యవహరాల శాఖ అభ్యర్థించింది. దీనికి అంగీకరించిన ఐరాస.. వీలైనంత త్వరగా దౌత్యపరమైన చర్చలు జరపాలని లేదంటే.. భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని