Hawaii: మృత్యువు అంచుకు వెళ్లి.. రివ్వున పైకెగిరి..!

ప్రమాదం అంచువరకు వెళ్లిన ఓ విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకొంది. ఈ ఘటన హవాయిలో చోటు చేసుకొంది.

Published : 14 Feb 2023 18:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన ఓ భారీ విమానం కొద్దిసేపటికే ఒక్కసారిగా కిందకు దిగిపోవడం మొదలైంది.. ఒక దశలో సముద్రానికి కేవలం కొన్ని వందల అడుగుల ఎత్తుకు చేరుకొంది. మృత్యువు తప్పదని అందరూ భయపడ్డారు. కానీ, చివరి క్షణంలో విమానం పుంజుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ ఘటన హవాయిలో చోటు చేసుకొంది. డిసెంబర్‌ 18వ తేదీన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ నెంబర్‌ 1722 విమానం హవాయి నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరింది. ఈ విమానం 2,200 అడుగుల ఎత్తుకు చేరేవరకు సాధారణంగానే ప్రయాణించింది. కానీ, ఆ తర్వాత  ఒక్కసారిగా 1,425 అడుగుల ఎత్తుకు పడిపోయింది. సముద్ర మట్టానికి కేవలం 800 అడుగుల ఎత్తుకు చేరింది. ఈ విషయాన్ని విమానాల రాకపోకలను పర్యవేక్షించే ఫ్లైట్‌రాడార్‌ 24 గుర్తించింది. ఈ విమానం యాయి ద్వీపం సమపంలో మళ్లీ పుంజుకొన్నట్లు డేటా చెబుతోంది.

ఆ విమానంలో ప్రయాణించిన రాడ్‌ విలియమ్స్‌ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ ‘‘ ఆ సమయంలో తాము రోలర్‌ కోస్టర్‌ ఎక్కినట్లు అనిపించింది. ప్రయాణికులు మొత్తం ప్రాణభయంతో కేకలు వేశారు. ఏదో అసాధారణ విషయం చోటు చేసుకొందని ప్రతి ఒక్కరికీ అర్థమైంది’’ అని పేర్కొన్నాడు. విమానం ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో భారీగా వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చాయి. విమానం కొద్దిసేపు ఒడిదొడుకులకు లోనైనా.. చివరికి పుంజుకొని ప్రయాణం కొనసాగించింది. రాత్రి 9 గంటల సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకొంది. ఈ ఘటనపై ఎఫ్‌ఏఏ విచారణ చేపట్టింది. పైలట్లను అదనపు శిక్షణకు పంపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని