Paris Olympics: ‘ఆ రెండు దేశాల్ని అనుమతిస్తే.. 40దేశాలు ఒలింపిక్స్‌ను బహిష్కరించగలవు!’

2024 పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics)లో రష్యా, బెలారస్‌ అథ్లెట్లను అనుమతిస్తే.. దాదాపు 40 దేశాల వరకు ఈ విశ్వక్రీడలను బహిష్కరించగలవని పోలాండ్‌ క్రీడాశాఖ మంత్రి తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో.. ఇరు దేశాలపై నిషేధం విధించాలని పాశ్చాత్య దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Published : 04 Feb 2023 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics)లో పాల్గొనేందుకు రష్యా(Russia), బెలారస్‌(Belarus) క్రీడాకారులకు అవకాశం కల్పించే విషయంలో వివాదం నెలకొంది. ఉక్రెయిన్‌ యుద్ధం(Ukraine Crisis) నేపథ్యంలో ఇరు దేశాలపై నిషేధం విధించాలని పాశ్చాత్య దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా పోలాండ్, లిథువేనియా, ఎస్తోనియా, లాత్వియాలు.. పారిస్‌ ఒలింపిక్స్‌లో రష్యా, బెలారస్‌ క్రీడాకారులను అనుమతించే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) ప్రణాళికను తిరస్కరించాయి. దాదాపు 40 దేశాలు ఈ విశ్వక్రీడలను బహిష్కరించగలవని, దీంతో మొత్తం ఈవెంట్‌ అర్థరహితంగా మారిపోతుందని పోలాండ్ క్రీడలశాఖ మంత్రి కమిల్ బోర్ట్‌నిజుక్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న ఐఓసీ సమావేశం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

తటస్థ జెండా(Neutral Flag) కింద రష్యా, బెలారస్‌ అథ్లెట్లు పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వీలుగా ఓ మార్గాన్ని అన్వేషించనున్నట్లు ఐఓసీ గత వారం ప్రకటించింది. ఏ అథ్లెట్‌నూ వారి పాస్‌పోర్ట్ కారణంగా అడ్డుకోకూడదని పేర్కొంది. అయితే.. ఈ ప్రకటనను బ్రిటన్‌తోసహా పలు దేశాలు ఖండించాయి. లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియా, పోలాండ్‌లకు చెందిన క్రీడామంత్రులు దీన్ని వ్యతిరేకించారు. తటస్థ ముసుగులో వారిని అనుమతించడం.. ఆ దేశాల రాజకీయ నిర్ణయాలు, దుష్ర్పచారాన్ని చట్టబద్ధం చేస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే విషయమై బ్రిటన్, అమెరికా, కెనడాతోసహా 40 దేశాల సంకీర్ణాన్ని నిర్మించడం సాధ్యమేనని విశ్వసిస్తున్నట్లు పోలాండ్‌ మంత్రి బోర్ట్‌నిజుక్ చెప్పారు. అమెరికా మాత్రం.. ఒకవేళ ఇరుదేశాల అథ్లెట్లను ఒలింపిక్స్‌కు అనుమతించినట్లయితే తటస్థ క్రీడాకారులుగా అనుమతించాలని పేర్కొంది.

రష్యా, బెలారస్‌లు పాల్గొంటే ఈ ఒలింపిక్స్‌ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్‌ ఇప్పటికే తెలిపింది. ఆ దేశాల అథ్లెట్లపై ఐఓసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ విధించిన నిషేధం కొనసాగించేలా ఒత్తిడి తీసుకురావాలని పాశ్చాత్య దేశాలను కోరుతోంది. అయితే, రష్యా, బెలారస్‌ అథ్లెట్లు పోటీలకు తిరిగి రావడంపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని ఐఓసీ గురువారం పునరుద్ఘాటించింది. ఉక్రెయిన్‌, ఇతర దేశాల హెచ్చరికలపై స్పందిస్తూ.. ‘ఒలింపిక్ క్రీడలను బహిష్కరిస్తామని బెదిరించడం.. ఒలింపిక్ ఉద్యమ ప్రాథమిక అంశాలు, సూత్రాలకు విరుద్ధం’ అని గురువారం పేర్కొంది. ‘బహిష్కరణ అనేది ఒలింపిక్ ఛార్టర్ ఉల్లంఘన. చరిత్రను పరిశీలిస్తే.. ఇదివరకటి బహిష్కరణలు వాటి రాజకీయ లక్ష్యాలను సాధించలేదు. అథ్లెట్లను శిక్షించడానికి మాత్రమే పనిచేశాయి’ అని గుర్తుచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు