China: అణు విద్యుత్తులోనూ చైనా దూకుడు

ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో అమెరికాను దాటి దూసుకుపోతున్న చైనా ఇప్పుడు అణు విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంలో అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టేలా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

Published : 18 Jun 2024 04:52 IST

వెనకబడుతున్న అమెరికా
తాజా నివేదికలో వెల్లడి

వాషింగ్టన్‌: ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో అమెరికాను దాటి దూసుకుపోతున్న చైనా ఇప్పుడు అణు విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంలో అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టేలా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అణువిద్యుత్‌ అభివృద్ధిలో చైనా మెరుపు వేగంతో దూసుకుపోతోందని అది పేర్కొంది. చైనా వేగానికి అమెరికా కనీసం 15 ఏళ్లు వెనకబడిపోయిందని వెల్లడించింది. ప్రస్తుతం చైనా వద్ద 27 అణు విద్యుత్తు రియాక్టర్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని పేర్కొంది. ఒక్కో దానిని పూర్తి చేయడానికి బీజింగ్‌కు సగటున ఏడేళ్ల సమయం పడుతోందని తెలిపింది. చైనాలోని ప్రభుత్వరంగ ఫైనాన్సింగ్‌ సంస్థలు కూడా అణువిద్యుత్తు రంగానికి కేవలం 1.4 శాతం వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి. పశ్చిమదేశాలు ఇచ్చే అప్పులతో పోలిస్తే ఇవి చాలా చౌక. దీనికితోడు వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా వీటికి అండగా నిలుస్తున్నాయి. దీంతో స్థానికంగా అణువిద్యుత్తు రంగంలో ఇప్పుడు డ్రాగన్‌ ప్రబల శక్తిగా ఎదిగింది. ఇప్పటికే బీజింగ్‌ పునరుత్పాదక ఇంధనం, విద్యుత్తు కార్ల విషయంలో అగ్రగామిగా నిలిచినట్లే. అణు విద్యుత్తులో కూడా వేగంగా దూసుకెళుతోంది. షిడో బేలో నిర్మించిన నాలుగోతరానికి చెందిన హైటెంపరేచర్‌ గ్యాస్‌ కూల్డ్‌ రియాక్టర్‌ గతేడాది ఆన్‌లైన్‌లోకి వచ్చింది. దీనిపై ది చైనా నూక్లియర్‌ ఎనర్జీ అసోసియేషన్‌ స్పందిస్తూ.. వీటిల్లో వినియోగించే 2,200 పరికరాలను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.  ప్రస్తుతం అమెరికా వద్దే అత్యధికంగా అణు రియాక్టర్లు ఉన్నాయి. జోబైడెన్‌ సర్కారు కూడా పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా ఉద్గారాలు, శుద్ధ ఇంధనంపై దృష్టిపెట్టింది. కానీ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో 2023-24 సంవత్సరాల్లో ప్రారంభమైన రెండు భారీ న్యూక్లియర్‌ ప్లాంట్లకు నిర్మాణ సమయం, ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువైంది. దీంతోపాటు అమెరికా ఇంకా కొత్తగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఓ అత్యాధునిక ప్లాంట్‌ నిర్మించాలనుకున్న ప్రణాళిక కూడా కార్యరూపందాల్చలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని