China: అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!

మరో కీలక రంగంలో చైనా అమెరికాను దాటేసి ముందుకెళ్లిపోయింది. ఈ విషయాన్ని వాషింగ్టన్‌కు చెందిన ఓ పరిశోధన సంస్థ వెల్లడించింది.

Published : 17 Jun 2024 15:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అణువిద్యుత్‌ అభివృద్ధిలో చైనా మెరుపు వేగంతో దూసుకుపోతోందని అమెరికా(USA)కు చెందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. చైనా (China) వేగానికి అమెరికా కనీసం 15 ఏళ్లు వెనకబడిపోయిందని వెల్లడించింది. ప్రస్తుతం చైనా వద్ద 27 అణు విద్యుత్తు రియాక్టర్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని పేర్కొంది. ఒక్కో దానిని పూర్తి చేయడానికి బీజింగ్‌కు సగటున ఏడేళ్ల సమయం పడుతోందని తెలిపింది. ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థ, ఈ రంగంలో సృజనాత్మక శక్తి పెరుగుదలకు ఇవి చాలా ఉపయోగపడతాయి.

చైనాలోని ప్రభుత్వరంగ ఫైనాన్సింగ్‌ సంస్థలు కూడా అణువిద్యుత్తు రంగానికి కేవలం 1.4 శాతం వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి. పశ్చిమదేశాలు ఇచ్చే అప్పులతో పోలిస్తే ఇవి చాలా చౌక. దీనికితోడు వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా వీటికి అండగా నిలుస్తున్నాయి. దీంతో స్థానికంగా అణువిద్యుత్తు రంగంలో ఇప్పుడు డ్రాగన్‌ ప్రబల శక్తిగా ఎదిగింది. ఇప్పటికే బీజింగ్‌ పునరుత్పాదక ఇంధనం, విద్యుత్తు కార్ల విషయంలో అగ్రగామిగా నిలిచినట్లే. అణు విద్యుత్తులో కూడా వేగంగా దూసుకెళుతోంది.  షిడో బేలో నిర్మించిన నాలుగోతరానికి చెందిన హైటెంపరేచర్‌ గ్యాస్‌ కూల్డ్‌ రియాక్టర్‌ గతేడాది ఆన్‌లైన్‌లోకి వచ్చింది. దీనిపై ది చైనా నూక్లియర్‌ ఎనర్జీ అసోసియేషన్‌ స్పందిస్తూ.. వీటిల్లో వినియోగించే 2,200 పరికరాలను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.  

ప్రస్తుతం అమెరికా వద్దే అత్యధికంగా అణు రియాక్టర్లు ఉన్నాయి. కానీ, జోబైడెన్‌ సర్కారు పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా ఉద్గారాలు, శుద్ధ ఇంధనంపై దృష్టిపెట్టింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో 2023-24 సంవత్సరాల్లో రెండు భారీ న్యూక్లియర్‌ ప్లాంట్లు ఆన్‌లైన్‌ అయ్యాయి. కానీ, వీటి నిర్మాణ సమయం, ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు అమెరికా ఇంకా కొత్తగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఓ యూనివర్శిటీలో నిర్మించాలనుకొన్న ల్యాబ్‌ ప్రాజెక్టును మూసేసింది. కాకపోతే అమెరికా ఈ రంగంపై పూర్తిస్థాయిలో దృష్టిపెడితే మాత్రం వేగంగానే చైనా కంటే ఎక్కువ అభివృద్ధి సాధించగలదని ఈ నివేదిక రాసిన స్టీఫెన్‌ ఎజెల్ల్‌ వెల్లడించారు. మరోవైపు ఈ నివేదికపై అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని