Published : 03 Jul 2022 01:49 IST

Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటన

వాషింగ్టన్‌: రష్యా ముప్పేట దాడులతో తీవ్రంగా చితికిపోతున్న ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోమారు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 820 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని అందజేయనున్నట్లు వైట్‌హౌజ్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌ సైనిక శక్తిని బలపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే సరికొత్త క్షిపణి వ్యవస్థను కూడా ఉక్రెయిన్‌కు అందివ్వనున్నట్లు పేర్కొంది.

సైనిక చర్య పేరుతో గత ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తూనే ఉంది. దీంతో ఉక్రెయిన్‌ ఆర్థికంగా, సైనిక పరంగా తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే బాధిత దేశానికి అమెరికా అండగా నిలుస్తోంది. పలుమార్లు ఆర్థికసాయం చేసి, ఆయుధాలు అందించింది. ఇప్పటివరకు 7 బిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించినట్లు  బైడెన్‌ సర్కారు పేర్కొంది. 8.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలు, సైనిక శిక్షణకు కూడా కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఒడెసా తీర ప్రాంతమే లక్ష్యంగా శుక్రవారం తెల్లవారుజామున రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని సెర్హివ్కా పట్టణంలో క్షిపణుల ధాటికి 21 మంది మృత్యువు పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో 38 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాస్కో ప్రయోగించిన కెహెచ్‌-22 క్షిపణులు ఓ అపార్టుమెంటుతో పాటు రెండు శిబిరాలపైకి దూసుకెళ్లడంలో ప్రాణ నష్టం సంభవించినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం వెల్లడించింది. రష్యా ఒక ఉగ్రవాద దేశమని, యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్‌ సేనల చేతిలో పరాభవాన్ని భరించలేకే... సామాన్య ప్రజానీకంపై దాడులకు తెగబడుతోందని మండిపడింది.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts