Chinook Chopper: భారత్‌కు అలర్ట్‌.. చినూక్‌ హెలికాప్టర్లను పక్కనపెట్టిన అమెరికా..!

సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే  400 చినూక్‌ హెలికాప్టర్లను అమెరికా సైన్యంలోని మెటీరియల్‌ కమాండ్‌ తాత్కాలికంగా పక్కనపెట్టింది.

Updated : 31 Aug 2022 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే  400 చినూక్‌ హెలికాప్టర్లను అమెరికా సైన్యంలోని మెటీరియల్‌ కమాండ్‌ తాత్కాలికంగా పక్కనపెట్టింది. వీటి ఇంజిన్లలో మంటలు చెలరేగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ హెలికాప్టర్లను బోయింగ్‌ సంస్థ తయారు చేస్తోంది. 1960 నుంచి దళాల రవాణా, విపత్తు సహాయక చర్యలు, క్షతగాత్రుల తరలింపు వంటి కార్యక్రమాల్లో చినూక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రకం హెలికాప్టర్లను ఇటలీ, దక్షిణ కొరియా, కెనడా, భారత్‌ తదితర దేశాలు వినియోగిస్తున్నాయి. భారత వాయుసేనలో ప్రస్తుతం 15 చినూక్‌లు సేవలు అందిస్తున్నాయి.

‘‘హెచ్‌-47(చినూక్‌) హెలికాప్టర్ల ఇంధన ట్యాంకులు లీకై మంటలు చెలరేగడానికి గల కారణాలను సైన్యం గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాం’’ అని అమెరికా సైన్యం అధికార ప్రతినిధి సింతియా.ఓ .స్మిత్‌ పేర్కొన్నారు. కాకపోతే ఈ ప్రమాదాల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ హెలికాప్టర్లను పక్కనపెట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తామని అమెరికా సైన్యం వెల్లడించింది. హనీవెల్‌ సంస్థ నిర్మించిన కొన్ని రకాల ఇంజిన్లు అమర్చిన హెలికాప్టర్లలో ఈ సమస్య ఉన్నట్ల చెబుతున్నారు. దీనిపై వ్యాఖ్యానించడానికి బోయింగ్‌ సంస్థ నిరాకరించింది. మరో వైపు హనీవెల్‌ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. అమెరికా సైన్యంతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ‘ఓ-రింగ్స్‌’గా పిలిచే భాగాలు సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని