Graduation Day: విద్యార్థులకు బిలియనీర్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. కారణమిదే!

గ్రాడ్యుయేషన్‌ డే రోజున విద్యార్థులకు బిలియనీర్‌ ఒకరు అనుకోని బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి అందుకున్న విద్యార్థుల ముఖాల్లో ఆనందానికి అవధుల్లేవు. ఇలాంటి బహుమతుల వల్ల విద్యార్థుల్లో సేవా గుణం అలవడుతుందని బిలియనీర్‌ అభిప్రాయప్డడారు. 

Published : 29 May 2023 01:28 IST

బోస్టన్‌: వారంతా తొలిసారి గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకుంటున్న విద్యార్థులు (Students). స్టేజ్‌పైకి వెళ్లి పట్టా అందుకుని తమ స్థానాల్లో కూర్చున్న వారందరికీ నిర్వాహకులు రెండు కవర్లు ఇస్తున్నారు. వాటిని తెరిచి చూసిన విద్యార్థుల కళ్లలో ఒక్కసారిగా ఆనందం. ఒక్కో కవర్లలో ప్రతి దానిలో 500 డాలర్ల నగదు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వారికిచ్చిన కవర్లలో ఒక దానిపై బహుమతి (Gift) అని, మరో కవర్‌పై ఇవ్వడం కోసం (Give) అని రాసుంది. ఇంతకీ తమకు నగదు కవర్లు ఎందుకిచ్చారు? ఒక కవర్‌పై ‘గిఫ్ట్‌’ అని, మరో దానిపై ‘గివ్‌’ అని ఎందుకు రాశారు? అసలు ఆ కవర్లు తమకు ఎవరిచ్చారు? అని విద్యార్థులు ఒకరితో ఒకరు చర్చించుకుంటుండగా.. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిలియనీర్‌ రాబర్ట్‌ హాలే (Robert Hale) ప్రసంగించడం ప్రారంభించారు. 

‘‘మీరంతా ఎంతో కష్ట కాలాన్ని దాటుకుని వచ్చారు. అదంత సులభంగా ఏం జరగలేదు. అందుకు మీరు ఎంతో ఆనందించాలి. మీ అందరిపట్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆ ఆనందాన్ని మీతో కలిసి పంచుకోవాలనుకుంటున్నాం. అందుకే మీకు రెండు బహమతులు ఇచ్చాం. మొదటిది మీకు బహుమతి కాగా, రెండోది మీరు ఇతరులకు ఇవ్వడం కోసం. మీరు రేపటి సమాజానికి ప్రతీకలు. మీకు దొరికిన దాంట్లో కొంత ఇతరులకు ఇస్తే మీ జీవితం మరింత సంతోషంగా సాగుతుంది. ఇందుకోసం మీకై మీరే కొన్ని అవకాశాలను అందుకోవాలి. ఓటమి గురించి చింతించవద్దు. ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోండి. దాని వల్ల మీకు సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది’’ అని రాబర్ట్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

విద్యార్థులకు తమకు లభించిన బహుమతి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి బహుమతి వల్ల విద్యార్థులకు సేవా గుణం అలవడుతుందని రాబర్ట్‌ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం బోస్టన్‌ (Boston)లోని మసాచూసెట్స్‌ విశ్వవిద్యాలయం (University of Massachusetts)లో జరిగింది. మొత్తం 2,500 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ డే (Graduation Day)లో పాల్గొనగా.. అందరికీ వెయ్యి డాలర్ల చొప్పున బహుమతిని అందించారు. రాబర్ట్‌ హాలే అమెరికాలో గ్రానైట్‌ టెలీకమ్యూనికేషన్స్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. అయితే, గతంలో కూడా ఆయన రెండుసార్లు విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. రాబర్ట్‌ హాలే వ్యక్తిగత సంపద విలువ ఐదు బిలియన్‌ డాలర్లు. తన సంపదలో ఎక్కువ మొత్తాన్ని ఆయన దాతృత్వ కార్యక్రమాల కోసం వెచ్చిస్తుంటారు. ఇప్పటి వరకు 280 మిలియన్‌ డాలర్లను క్యాన్సర్‌ పరిశోధనలు, విద్యాసంస్థలతోపాటు ఇతర దాతృత్వ కార్యక్రమాల కోసం ఇచ్చినట్లు ఫోర్బ్స్‌ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని