Thomas Lee: అమెరికాలో తుపాకీతో కాల్చుకుని.. బిలియనీర్‌ ఆత్మహత్య..!

రూ.16,500కోట్ల సంపద కలిగిన ప్రముఖ బిలియనీర్‌ థామస్‌ లీ (Thomas Lee) ఆత్మహత్య చేసుకోవడం అగ్రరాజ్య వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. తన ఆఫీసులోనే ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు.

Published : 25 Feb 2023 14:24 IST

వాషింగ్టన్‌: అమెరికా (US)కు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ లీ ఈక్విటీ అధినేత, బిలియనీర్‌ థామస్‌ లీ (Thomas Lee) (78) ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆఫీసులోనే తుపాకీతో కాల్చుకుని ఆయన చనిపోయినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

అమెరికా (America) కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం మన్‌హట్టన్‌లోని తన కార్యాలయానికి వచ్చిన థామస్‌ లీ (Thomas Lee).. చాలా సేపటి వరకు గది నుంచి బయటకు రాలేదు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా లీ బాత్రూమ్‌లో రక్తపు మడుగులో కన్పించారు. దీంతో వెంటనే ఆమె 911కు కాల్‌ చేసింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే ఆయన మరణించారు. ఆయన తలకు బులెట్‌ గాయమైంది. లీ తనను తాను కాల్చుకుని మరణించి ఉంటారని పోలీసులు వెల్లడించినట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. ఆయన మరణంపై కుటుంబసభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే అందులో మృతికి గల కారణాలను వారు పేర్కొనలేదు.

ఎవరీ థామస్‌ లీ..

78 ఏళ్ల లీ (Thomas Lee).. అమెరికా (US)లో ప్రముఖ ఇన్వెస్టర్‌, ఫైనాన్షియర్‌. ప్రైవేట్‌ ఈక్విటీ మార్కెట్‌, పెట్టుబడి వ్యాపారాలకు ఆయనను మార్గదర్శకుడిగా భావిస్తారు. 1974లో థామస్‌ హెచ్‌ లీ పార్ట్నర్స్‌ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 2006లో లీ ఈక్విటీని ప్రారంభించారు. దాదాపు 5 దశాబ్దాలుగా వందలాది సంస్థల్లో ఆయన 15 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. వ్యాపారవేత్తగానే గాక, దాతగా ఆయనకు ఎంతో మంచి పేరుంది. ది లింక్లన్‌ సెంటర్‌, మ్యూజియం అండ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌, బ్రాండీస్‌ యూనివర్శిటీ, హార్వర్డ్ యూనివర్శిటీ, మ్యూజియం ఆఫ్‌ జెవిష్‌ హెరిటేజ్‌ వంటి సంస్థల్లో ఆయన ట్రస్టీ హోదాలో బోర్డు సభ్యుడిగా వ్యవహరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ (Bill Clinton) దంపతులకు థామస్‌ లీ స్నేహితుడు. ఆయన నికర సంపద దాదాపు 2 బిలియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.16,500కోట్లకు పైమాటే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని