Honeymoon: హనీమూన్‌ జంటను సముద్రంలో వదిలేసిన పడవ.. రూ.40కోట్లకు దావా

హనీమూన్‌లో (Honeymoon) భాగంగా సముద్రంలో ఈతకు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురయ్యింది. స్నొర్కెలింగ్‌ తీసుకెళ్లిన పడవ.. ఆ జంటను మధ్యలోనే వదిలివేసింది. దీంతో భయంతో ఒడ్డువరకూ ఈదుకుంటూ వచ్చిన ఆ జంట.. ట్రావెల్‌ ఏజెన్సీపై కోర్టులో దావా వేసింది.

Published : 06 Mar 2023 01:35 IST

వాషింగ్టన్‌: కొత్తగా పెళ్లైన జంట తమ హనీమూన్‌ను (Honeymoon) మధుర జ్ఞాపకాలతో నింపేయాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ పర్యాటక ఏజెన్సీని సంప్రదించి హవాయి దీవులకు టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త జంటను అక్కడికి తీసుకెళ్లిన ఆ ఏజెన్సీ, తీరా.. సముద్రం మధ్యలోనే వదిలేసి రావడం గమనార్హం. దీంతో ఆ నవదంపతులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే, తమ ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ ఏజెన్సీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ కపుల్‌.. తమకు పరిహారం చెల్లించాలంటూ తాజాగా కోర్టును ఆశ్రయించినట్లు అమెరికా మీడియా పేర్కొంది.

కాలిఫోర్నియాకు చెందిన ఎలిజబెత్‌ వెబ్‌స్టెర్‌, అలెగ్జాండర్‌ బర్కల్‌లు.. 2021లో పెళ్లి చేసుకున్నారు. హనీమూన్‌లో భాగంగా అక్కడి హవాయి (Hawaii) దీవుల్లోని లనాయ్‌ (Lanai) ప్రాంతానికి వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇందుకోసం ‘సెయిల్‌ మౌయీ’ అనే పర్యాటక ఏజెన్సీని సంప్రదించారు. సెప్టెంబర్‌ 2021లో టూర్‌కు వెళ్లారు. అందులో భాగంగా.. డైవింగ్‌ మాస్కులు, స్విమ్‌ సూట్‌ ధరించి సముద్ర గర్భంలో ‘స్నొర్కెలింగ్‌’కు (Snorkelling) బయలుదేరారు. సుమారు 44 మంది పర్యాటకులను తీసుకెళ్లిన పడవ.. ఓ చోట నిలిపింది. ఈతకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిన బోట్‌ కెప్టెన్‌.. ఎక్కడకు, ఎంత సమయంలోపు తిరిగి రావాలో మాత్రం స్పష్టంగా చెప్పలేదట.

అలా ఓ గంటసేపు నీటిలో గడిపిన ఆ దంపతులు.. సముద్రం అస్థిరంగా మారుతున్నట్లు గమనించారు. దీంతో 15 నిమిషాలపాటు ఈదుకుంటూ పడవ దగ్గరకు చేరుకునేందుకు యత్నించగా.. పడవ మరింత దూరం వెళ్తుండటాన్ని గుర్తించారు. దాన్ని అందుకునేందుకు యత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో ఆ జంట ప్రాణాలకు తెగించి ఒడ్డు వరకూ ఈదుకుంటూ వచ్చింది. మధ్యలో అలసిపోయిన, సత్తువ కోల్పోయిన తమకు ఐలాండ్‌లో నివసించే ఓ వ్యక్తి సహాయం చేసినట్లు తెలిపింది. ఇలా తమకు ఎంతో మానసిక వేదన, భయభ్రాంతులకు గురిచేసిన ఆ ఘటనకు కారణమైన టూర్‌ ఏజెన్సీపై చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న అక్కడి కోర్టులో దావా వేసింది. ఏజెన్సీ నిర్వహణ లోపం వల్లే ఆ ఘటన జరిగిందని.. తమ ప్రాణాలకు ముప్పు కలిగిందని, పరిహారంగా ఈ ట్రావెల్‌ ఏజెన్సీ 5మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.40కోట్లు) చెల్లించాలని డిమాండు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు