26/11 ముంబయి దాడుల సూత్రధారి రాణాను భారత్‌కు అప్పగించనున్న అమెరికా

26/11 ముంబయి దాడుల(2008 Mumbai terror attack) నిందితుల్లో ఒకడైన తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికాకు చెందిన కోర్టు అంగీకరించింది. నెల రోజుల్లో ప్రధాని మోదీ అగ్రరాజ్యంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

Updated : 18 May 2023 15:16 IST

వాషింగ్టన్‌: వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) అమెరికా(USA)లో పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాదం కట్టడికి ఇరుదేశాల మధ్య కీలక అడుగుపడింది. 26/11 ముంబయి దాడుల్లో కీలక నిందితుల్లో ఒకడైన తహవూర్‌ రాణాను అప్పగించాలని భారత్‌ చేసిన అభ్యర్థనకు ఆమోదం లభించింది. ఈ మేరకు అమెరికాలోని కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. భారత్‌-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పాకిస్థాన్‌ మూలాలున్న తహవూర్‌ రాణా 2008లో జరిగిన ముంబయి దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

26/11 ముంబయి దాడుల్లో అతడి పాత్రపై ఎన్‌ఐఏ (NIA)దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా అతడిని అప్పగించాలని భారత్‌ కోరడంతో ప్రస్తుతం రాణా అమెరికా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు 14 సంవత్సరాలు జైలు శిక్ష కూడా  విధించింది.

2008 నవంబర్‌ 26న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్‌ హెడ్లీకి తహవూర్‌ అత్యంత సన్నిహితుడు. అలాగే దాడులకు ముందు ముంబయిలో తుది రెక్కీ నిర్వహించింది కూడా తహవూరేనని విచారణలో భాగంగా హెడ్లీ గతంలోనే వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. జూన్‌ 22న ప్రధాని అమెరికా (USA)లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden),ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ (Jill Biden)లు ప్రధాని మోదీ కోసం స్టేట్‌ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు