USA: అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్‌ న్యూస్‌

హెచ్‌1బీ వీసా (H1B visa) అమెరికాలో పని చేస్తున్న ఉద్యోగులకు అక్కడి న్యాయస్థానం అనుకూలంగా చెప్పింది. వారి జీవితభాస్వాములు ఉద్యోగాలు చేయకూడదంటూ ఓ ఆర్గనైజేషన్‌ దాఖలు చేసిన దావాను కొట్టివేసింది. 

Published : 30 Mar 2023 15:48 IST

వాషింగ్టన్‌: హెచ్‌1బీ వీసా (H1B Visa)తో అమెరికా (USA) పని చేస్తున్న విదేశీ  సాంకేతిక నిపుణులకు, ఉద్యోగులకు అనుకూలంగా అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ’ సంస్థ దాఖలు చేసిన దావాను యూఎస్‌ జిల్లా న్యాయమూర్తి తన్యా చుక్తాన్‌ కొట్టివేశారు. బరాక్‌ ఒబామా (Barack Obama) అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్‌1బీ వీసాతో అమెరికాలో పని చేస్తున్న వారి జీవితభాగస్వామి కూడా ఉద్యోగం చేసుకునేందుకు వీలు కలిగేలా చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. దీనివల్ల స్థానికంగా ఉన్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని, అందువల్ల హెచ్‌1బీ వీసాదారుల జీవితభాగస్వామి ఉద్యోగంలో చేరేందుకు వీలు కల్పించకుండా కోర్టు జోక్యం చేసుకోవాలని సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ దావాను వ్యతిరేకించాయి.హెచ్‌1బీ వీసాదారులతోపాటు దాదాపు లక్షకు పైగా వారి జీవిత భాగస్వాముల ఉద్యోగాలు చేసుకునేలా గతంలో యూఎస్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉండటం గమనార్హం. తాజాగా కోర్టు వెలువరించిన తీర్పుతో అమెరికాలోని చాలా మంది భారతీయులకు ప్రయోజనం కలుగుతుంది.

హెచ్‌1బీ వీసాధారులపై ఆధారపడేవారికి, జీవితభాగస్వామికి హెచ్‌4 వీసా ఇస్తారు.‘‘ హెచ్‌4 వీసాతో అమెరికాలో ఉంటున్న వారు అక్కడ పని చేసేందుకు అనుమతించే అధికారాన్ని దేశరక్షణశాఖకు అమెరికన్‌ కాంగ్రెస్‌ ఇవ్వలేదని సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ అభిప్రాయపడుతోంది. కానీ, ఇది ఇమ్మిగ్రేషన్‌, జాతీయ చట్టాల పరిధిలోకి వస్తుంది.’’ అని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి చుక్తాన్‌ తెలిపారు. అంతేకాకుండా హెచ్‌1బీ వీసా పొందిన వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉండటంతోపాటు, ఇక్కడ ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇచ్చిందని ఆమె తెలిపారు.

కోర్టు తీర్పు పట్ల అమెరికాలోని భారతీయులతోపాటు ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్నవారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వలసదారుల హక్కులకు భంగం కలుగకుండా, వారి కుటుంబాలకు మద్దతిచ్చేలా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.‘హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు పని చేయడానికి అనుమతించేలా కోర్టు ఇచ్చిన తీర్పుతో.. దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నిర్ణయంతో జీవనం సాగించేందుకు కష్టపడుతున్న కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఆర్థికంగా కాస్త నిలదొక్కుకునేందుకు ఇది దోహదం చేస్తుంది’’ అని భుటోరియా అనే న్యాయవాది అక్కడి మీడియాకు తెలిపారు. మరోవైపు, జిల్లా కోర్టు తాజా తీర్పుపై పై కోర్టుకు వెళ్తామని సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ సంస్థ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు