Ukraine: నాటోలో సమసిన విభేదాలు..ట్యాంకులపై నిర్ణయానికి వచ్చిన అమెరికా, జర్మనీ..!

నాటోలో విభేదాలకు కారణమైన ట్యాంకుల విషయంలో అమెరికా(USA), జర్మనీ(Germany) రాజీకి వచ్చాయి. రెండు దేశాలు తమ అత్యాధునిక ట్యాంకులను కీవ్‌కు ఇచ్చేందుకు అంగీకరించాయి. 

Updated : 25 Jan 2023 12:21 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇచ్చే విషయంలో నాటో మధ్య విభేదాలకు తెరపడింది. అమెరికా, జర్మనీ రెండూ వాటి ట్యాంకులను ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అంగీకరించాయి. అమెరికా వినియోగించే అత్యాధునిక ఎం1 అబ్రామ్స్‌ కూడా ఉక్రెయిన్‌ యుద్ధ రంగంలోకి అడుగుపెట్టనున్నాయి. దాదాపు 30 ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందించాలని జో బైడెన్‌ సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. బుధవారం దీనిపై నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మరో వైపు జర్మనీ కూడా కనీసం 14 లెపర్డ్‌-2 ట్యాంకులను కీవ్‌కు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై అమెరికాలోని రష్యా రాయబారి మండిపడ్డారు. ఇది మరో కవ్వింపు చర్య అని వ్యాఖ్యానించారు. 
ట్యాంకుల విషయంపై ఉక్రెయిన్‌ అధికారులు మాట్లాడుతూ రష్యా నుంచి భూభాగాలు స్వాధీనం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని అన్నారు.

ఇప్పటి వరకు ట్యాంకులు పంపాలని అమెరికా, జర్మనీపై భారీగా ఒత్తిడి వచ్చింది. అయినా ఈ రెండు దేశాలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తమ అత్యాధునిక ట్యాంకులు వాడాలంటే టెక్నాలజీపై కఠినమైన శిక్షణ అవసరమని అమెరికా చెబుతూ వచ్చింది. మరో వైపు జర్మనీ కూడా లెపర్డ్‌-2 ట్యాంకులను ఉక్రెయిన్‌కు ఇస్తే.. నాటో నేరుగా యుద్ధంలో జోక్యం చేసుకొన్నట్లవుతుందని చెప్పింది. దీనికి తోడు అమెరికా ట్యాంకులు పంపితేనే తాము కూడా లెపర్డ్‌-2లను కీవ్‌కు ఇస్తామని జర్మనీ చెప్పడంతో నాటోలో అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వంపై అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది. ‘‘మా అబ్రామ్స్‌ ట్యాంకులను ఇస్తేనే జర్మనీ కూడా లెపర్డ్‌-2లను ఉక్రెయిన్‌కు పంపుతామని షరతు విధిస్తుంటే.. మనం అబ్రామ్స్‌ను పంపాల్సిందే’’ అని డెమొక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ క్రిస్‌ కూన్స్‌ వ్యాఖ్యానించారు. నాటో, ఐరోపాలో కనీసం 16 దేశాలు లెపర్డ్‌ ట్యాంకులను వినియోగిస్తున్నాయి. నాటో సభ్యదేశమైన బ్రిటన్‌ ఇప్పటికే ఛాలెంజర్ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందించేందుకు సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని