china: చైనా సరిహద్దుల్లోకి అమెరికా రహస్య విమానం..!

దక్షిణ చైనా సముద్రం దిక్కుకు వచ్చే అమెరికా మిత్రదేశాల విమానాలను చైనా టార్గెట్‌ చేస్తోంది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, కెనడా విమానాలతో దుందుడుకుగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో

Published : 11 Jun 2022 01:56 IST

దక్షిణ చైనా సముద్రంలో ఆర్‌సీ-135 విమానం కదలికలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

దక్షిణ చైనా సముద్రం దిక్కుకు వచ్చే అమెరికా మిత్రదేశాల విమానాలను చైనా టార్గెట్‌ చేస్తోంది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, కెనడా విమానాలతో దుందుడుకుగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో అమెరికా తన సూపర్‌ స్పై విమానమైన ఆర్‌సీ-135యూను రంగంలోకి దించింది. ఈ విమానం ఏకంగా చైనా అణు సబ్‌మెరైన్ల స్థావరానికి అత్యంత సమీపంలోకి దర్జాగా ప్రయాణించింది. ఈ విషయాన్ని ఆన్‌లైన్‌ ఫ్లైట్‌ ట్రాకింగ్‌ సంస్థలు కూడా ధ్రువీకరించాయి. ఆసియాలోనే అతిపెద్ద రక్షణ రంగ సదస్సు ‘ది షంగ్రిలా డైలాగ్‌’ రేపటి నుంచి సింగపూర్‌లో ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, చైనా రక్షణ మంత్రి వీఫెంగ్‌ హాజరుకానున్న నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రం బలప్రదర్శనకు వేదికగా మారింది.

ఏం జరిగింది..?

జూన్‌ 6న అమెరికాకు చెందిన ఆర్‌సీ-135యూ విమానం చైనాలోని హనాన్‌ ద్వీపం సమీపంలో ప్రయాణించింది. ఈ ప్రదేశంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీకి చెందిన అణు సబ్‌మెరైన్ల స్థావరం యూలిన్‌ నేవల్‌ బేస్‌ ఉంది. ఈ విమానం జపాన్‌లోని ఒకినావలో ఉన్న కడేనా బేస్‌ నుంచి బయల్దేరింది. దక్షిణ చైనా సముద్రంలో ఆస్ట్రేలియా విమానాన్ని అడ్డుకొన్నారన్న వార్తలు వచ్చిన రోజే ఆర్‌సీ-135 హైనాన్‌ వైపు ప్రయాణించడం గమనార్హం. అది కూడా 2001లో ప్రమాదానికి గురైన అమెరికా నిఘా విమానం ప్రయాణించిన మార్గంలోనే ఆర్‌సీ-135 వెళ్లడం విశేషం. ఈ సార్టీలో ఆర్‌సీ-135 విమానం.. పరాసల్‌, వూడీ ద్వీపాల వద్ద చైనా ఏర్పాటు చేసిన వ్యవస్థల సమాచారాన్ని సేకరించి ఉంటుందని భావిస్తున్నారు. జూన్‌ 3న కూడా ఇటువంటి సార్టీలను నిర్వహించినట్లు తెలిసింది.

ఆర్‌సీ-135యూ విమానానికి ఎందుకంత ప్రాధాన్యం..

ఇది అమెరికాలో అత్యంత శక్తిమంతమైన నిఘా విమానాల్లో ఒకటి. టెక్నికల్‌ ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ను సేకరించడానికి దీనిని ఉపయోగిస్తారు. రాడార్‌ వార్నింగ్‌ రిసీవర్లు, రాడార్‌ జామర్లు, డెకాయ్‌, యాంటీ రేడియేషన్‌ క్షిపణులు దీనిలో ఉంటాయి. దీనిలో వివిధ వ్యవస్థలపై పనిచేసే 23 మంది నిపుణులు ఉంటారు. ఈ విమానం సంకేతాలను, ఉద్గారాలతో పాటు పలు రకాల సమాచారాన్ని సురక్షితంగా సేకరించగలదు. ఈ ఆర్‌సీ-135 విమానాలు అమెరికా, యూకేలు మాత్రమే వాడతాయి.

2001లో  అమెరికా నౌకాదళానికి చెందిన ఈపీ-3ఈ యారెస్‌-2 నిఘా విమానానికి  చైనాకు చెందిన ఎఫ్‌-8 ఫైటర్‌ జెట్‌ విమానం అత్యంత సమీపంలోకి వచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో చైనా పైలట్‌ మృతి చెందగా.. అమెరికా విమానాన్ని చైనాలోని హైనన్‌ ద్వీపంపై ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన ఈపీ-3ఈ విమానం ల్యాండ్‌ కావడానికి ముందే అందులోని అత్యాధునిక నిఘా పరికరాలను సిబ్బంది ధ్వంసం చేసేశారు. అనంతరం విమానం ల్యాండ్‌ అయ్యాక 24 మంది అమెరికా సిబ్బందిని 11 రోజులపాటు ఉంచి.. తర్వాత చైనా విడుదల చేసింది.

అమెరికా మిత్రదేశాలపై గ్రేజోన్‌ ఆపరేషన్లు..

సాధారణంగా యుద్ధానికి దారితీయని చిన్నచిన్న దుందుడుకు చర్యలతో ప్రత్యర్థుల్లో భయాన్ని పెంచడాన్ని సైనిక నిపుణులు గ్రేజోన్‌ ఆపరేషన్‌గా అభివర్ణిస్తారు. దక్షిణ చైనా సముద్రంలో నిర్మానుష్య దీవులను సైనిక స్థావరాలుగా మార్చిన డ్రాగన్‌ ఆ తర్వాత నుంచి దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇటీవల అమెరికా మిత్రదేశాలపై గ్రేజోన్‌ ఆపరేషన్లను తీవ్రం చేసిందని ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్‌ ఆసియా ఇనిస్టిట్యూట్‌ పరిశోధకుడు పీటర్‌ లేటొన్‌ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా విమానాన్ని అడ్డుకోవడాన్ని సమర్థించుకోవడం కూడా దీని కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఒక వేళ దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ పైలట్ల కారణంగా ప్రమాదం జరిగి ఉద్రిక్తతలు తలెత్తినా పట్టించుకోదు. అదే సమయంలో ఇలాంటి చర్యల కారణంగా యుద్ధం తలెత్తుతుందని చైనా అనుకోవటంలేదని నిపుణులు చెబుతున్నారు. అసలు యుద్ధం చేసే ఉద్దేశమే దానికి లేదని పేర్కొంటున్నారు.

అమెరికా మిత్రదేశాల బంధంపై దెబ్బకొట్టడానికి చైనా ముఖ్యంగా గ్రేజోన్‌ ఆపరేషన్లు నిర్వహిస్తోందని ర్యాండ్‌ కార్పొరేషన్‌కు చెందిన టిమోతీ హీత్‌ పేర్కొన్నారు. నేరుగా అమెరికాపై గ్రేజోన్‌ ఆపరేషన్లు నిర్వహిస్తే కొంత రిస్క్‌ ఉంటుంది. అదే మిత్రదేశాలైతే ఎటువంటి ప్రమాదం ఉండదు. అదే సమయంలో అమెరికా ఎంతవరకు వాటికి మద్దతుగా వస్తుంది.. అనే విషయంపై చైనాకు అవగాహన వస్తుంది. ఇందులోని లోపాలను గుర్తించి చైనా వాడుకొనే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయా దేశాల్లోని ప్రజలు కూడా అమెరికాతో జట్టుకడితే తలెత్తే నష్టాలను తెలిసివచ్చేట్లు చేయడమే దాని లక్ష్యమని చెబుతున్నారు. సుదీర్ఘకాలం పాటు గ్రేజోన్‌ వ్యూహాలను అమలు చేస్తే అమెరికా ప్రభావం కనుమరుగవుతుందని డ్రాగన్‌ నమ్ముతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని