Imran Khan: దండయాత్ర లేకుండానే పాక్‌ను బానిసగా మార్చిన అమెరికా: ఇమ్రాన్‌ఖాన్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎలాంటి దండయాత్ర చేయకుండానే ఈ దేశాన్ని అమెరికా బానిసగా మార్చేసిందంటూ దుయ్యబట్టారు. ఈ ‘దిగుమతి ప్రభుత్వాన్ని

Published : 16 May 2022 15:33 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. అగ్రరాజ్యం అమెరికాపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎలాంటి దండయాత్ర చేయకుండానే ఈ దేశాన్ని అమెరికా బానిసగా మార్చేసిందంటూ దుయ్యబట్టారు. ఈ ‘దిగుమతి ప్రభుత్వాన్ని’ ప్రజలు ఎన్నటికీ అంగీకరించబోరన్నారు.

అవిశ్వాస తీర్మానం ద్వారా గత నెల ఇమ్రాన్‌ ఖాన్‌ పాక్‌ ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా కుట్ర పన్నిందంటూ ఇమ్రాన్‌ పలుమార్లు ఆరోపించారు. తాజాగా మరోసారి అగ్రరాజ్యం జోక్యాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పంజాబ్‌లోని ఫైసలాబాద్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ‘‘ఎలాంటి దాడులు, దండయాత్రలు చేయకుండానే పాకిస్థాన్‌ను అమెరికా బానిసను చేసేసింది’’ అని ఆరోపించారు. తన సొంత ప్రయోజనాలు చూసుకోకుండా ఆ దేశం ఎవరికీ సాయం చేయదని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా పాక్‌ ప్రస్తుత విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా విదేశాంగ మంత్రి నుంచి బిలావల్‌ డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘‘బిలావల్‌, ఆయన తండ్రి ఆసిఫ్‌ అలీ జర్దారీ అవినీతికి పాల్పడి కూడగట్టుకున్న సంపాదన అంతా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాచిపెట్టారు. అందుకే వాళ్లు అమెరికాను ఎదిరించలేరు. ఒకవేళ అలా చేస్తే వాళ్లు సర్వం కోల్పోవాల్సిందే’’ అని ఇమ్రాన్‌ ఎద్దేవా చేశారు.

గత శనివారం మరో ర్యాలీలో మాట్లాడుతూ.. తనను హత్య చేయడానికి పాక్‌ లేదా విదేశాల్లో కుట్ర జరుగుతోందని ఇమ్రాన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.  తనకు ఏం జరిగినా.. అందుకు కారకులెవరన్నది ప్రజలు గుర్తించగలరన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియం షరీఫ్‌ ఖండించారు. కుట్ర జరుగుతోందన్న ఆరోపణలను ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని