USA: కోలుకోని పర్యాటకం.. వీసాల మంజూరుపై అమెరికా కీలక నిర్ణయం!

పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీసా మంజూరుకు భారతీయులకు నిరీక్షణ సమమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

Published : 28 Jul 2023 01:35 IST

వాషింగ్టన్: కొవిడ్‌ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకం (Tourism) పూర్తిగా దివాలా తీసింది.  పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత క్రమంగా కోలుకుంటోంది. కొవిడ్‌ విజృంభణకు ముందుతో పోల్చితే.. స్పెయిన్‌లో (Spain) దాదాపు 86శాతం మేర పర్యాటకం పుంజుకుంది. 2019లో జూన్‌ చివరినాటికి ఆ దేశానికి వచ్చిన పర్యాటకుల సంఖ్యతో పోల్చుకుంటే ఈ ఏడాది 28శాతం అధికంగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు ఫ్రాన్స్‌లోనూ (France) గతంతో పోల్చుకుంటే పర్యాటకుల సంఖ్య కేవలం 3 శాతం మాత్రమే తక్కువగా ఉంది. కానీ, అగ్రరాజ్యంలో మాత్రం పరిస్థితులు కుదుటపడటం లేదు. 

యూఎస్‌ ట్రావెల్‌ అసోసియేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్‌ చివరినాటికి అమెరికాలో పర్యాటకుల సంఖ్య కొవిడ్‌ మునుపటి పరిస్థితులతో పోల్చుకుంటే 26శాతం తక్కువగా ఉంది. అంతేకాకుండా పర్యాటకులు ఖర్చు చేసే సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పర్యాటకం ద్వారా అమెరికా 99 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఆదాయం వచ్చింది. అదే 2019లో 79.4 మిలియన్ల మంది పర్యాటక వీసాపై వచ్చి 181 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు సగానికిపైగా ఆదాయం తగ్గినట్లే చెప్పాలి.

భారతీయ నిపుణులకు బ్రిటన్‌ వీసా

మరోవైపు యూఎస్‌కు పర్యాటకుల సంఖ్య తగ్గడానికి వీసా ప్రక్రియ కూడా ఓ కారణం అనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యాటక వీసా పొందాలంటే కనీసం 400 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో అక్కడికి వెళ్లేందుకు చాలా మంది పెద్దగా మొగ్గు చూపడం లేదు.  కెనడా, యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌ దేశాలు పర్యాటకుల సంఖ్యను పెంచుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మెక్సికో, బ్రెజిల్‌, కొలంబియా, అర్జెంటీనా, ఇజ్రాయిల్ తదితర దేశాల పౌరులు ఎలాంటి వీసా లేకుండా తమ దేశంలో పర్యటించేందుకు ఈయూ అవకాశం కల్పించింది.  కొలంబియా, పెరు తదితర దేశాల నుంచి వచ్చే వారికి బ్రిటన్‌ విసా నుంచి మినహాయింపు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో అమెరికా కూడా పర్యాటకాన్ని పెంపొందించుకునేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌ నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న తరుణంలో భారతీయులకు పర్యాటక వీసా వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించి, వీలైనంత త్వరగా వీసా మంజూరు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్కడి పర్యాటక సంస్థలు తెలిపాయి. మరోవైపు లాక్‌డౌన్‌ ముగిసి, అమెరికాకు విదేశాల నుంచి రాకపోకలు ప్రారంభమైన తర్వాత హోటల్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆ ఖర్చును భరించేందుకు వెనకాడిన కొందరు ఇతర దేశాలను చూసొచ్చేందుకు వెళ్తున్నట్లు కొందరు చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు