US: 2016 తర్వాత ఇప్పుడే.. 1.25లక్షల మంది భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు

గతేడాది అత్యధికంగా 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.

Published : 05 Jan 2023 11:23 IST

వాషింగ్టన్‌: భారతీయుల వీసా (US Visa) సమస్యలను పరిష్కరించేందుకు, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించేందుకు  అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అమెరికా తెలిపింది. గత కొన్నేళ్లతో పోలిస్తే 2022లో భారత విద్యార్థులకు అత్యధికంగా వీసాలు (Student Visa) జారీ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్‌ రోజువారీ విలేకరుల సమావేశంలో తెలిపారు.

భారత్ సహా కొన్ని దేశాల్లో అమెరికా వీసాల (Visa) కోసం దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం ఆందోళనకరంగా మారింది. దీనిపై నెడ్‌ ప్రైస్‌ (Ned Price) మాట్లాడుతూ.. ‘‘పెండింగ్‌ వీసాలను పరిష్కరించి, ఇంటర్వ్యూ వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించడమే మా ప్రథమ ప్రాధాన్యం. దీనికోసం అమెరికా (US) విదేశాంగ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు చాలా దేశాల్లో కొవిడ్ ఆంక్షలను సరళీకరించారు. దీంతో అమెరికా వీసాలకు డిమాండ్‌ పెరిగింది. అయితే, సిబ్బంది కొరత, ఇతరత్రా సవాళ్ల కారణంగా కొంతకాలంగా వీసాల జారీ ప్రక్రియ నెమ్మదించింది. దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. వీసాల జారీ కోసం కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాం. ఇప్పుడు వీసా (Visa) జారీల ప్రక్రియ కొంత పుంజుకుందని, ఏడాదిలోగా కొవిడ్‌ ముందు నాటి స్థితికి చేరుకుంటుంది’’ అని వెల్లడించారు.

ఇక 2022లో 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు (Student Visas) జారీ చేసినట్లు నెడ్‌ ప్రైస్‌ తెలిపారు. 2016 తర్వాత ఒక ఏడాదిలో భారత్‌కు అత్యధిక స్టూడెంట్ వీసాలు జారీ చేయడం మళ్లీ ఇప్పుడే అని తెలిపారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత.. అమెరికాలో ఉన్నత విద్యకు భారత్‌ నుంచి మళ్లీ డిమాండ్‌ పెరిగింది. కాగా.. అమెరికా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్‌ విద్యార్థుల వాటా 20 శాతం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని