Indo Pacific Trade Bloc: ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌కు శ్రీకారం

ఇండో-పసిఫిక్‌ దేశాల మధ్య వాణిజ్యబంధం పెంపొందించేలా సరికొత్త అధ్యాయం మొదలైంది. జపాన్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌కు శ్రీకారం చుట్టారు.

Published : 23 May 2022 16:42 IST

జపాన్‌లో ప్రారంభించిన జోబైడెన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండో-పసిఫిక్‌ దేశాల మధ్య వాణిజ్యబంధం పెంపొందించేలా సరికొత్త అధ్యాయం మొదలైంది. జపాన్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌కు శ్రీకారం చుట్టారు. మొత్తం 13 దేశాలతో ప్రారంభించిన ఈ బ్లాక్‌లో భారత్‌, జపాన్‌ కూడా సభ్యులుగా ఉన్నాయి. ఈ ప్రాంత శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఐపీఈఎఫ్‌) ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ‘‘21వ శతాబ్ధంలో ఈ ప్రాంతంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మిత్రులు, భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకే ఈ ఫ్రేమ్‌ వర్క్‌’’ బైడెన్‌ వెల్లడించారు.

సాధారణ వాణిజ్య కూటముల మాదిరిగానే  దీనిలో టారీఫ్‌లు, మార్కెట్‌ యాక్సెస్‌లపై చర్చించేందుకు ఏమీలేవు. ఐపీఈఎఫ్‌ కింద భాగస్వామ్య దేశాలను నాలుగు అంశాల్లో నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం అనుసంధానించేందుకు యత్నిస్తుంది. వీటిల్లో డిజిటల్‌ ఎకనామీ, స్లపయ్‌ చైన్స్‌, క్లీన్‌ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, యాంటీ కరెప్షన్‌ వంటివి దీనిలో ఉన్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, అందరికీ అందుబాటులో ఉండేందుకు కట్టుబడి ఉన్నాం. సుసంపన్న వృద్ధి, శాంతి కోసం భాగస్వాముల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడటం ముఖ్యం’’ అని జాయింట్‌ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.  

ఈ వాణిజ్య కూటమిలో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండియా, ఇండోనేషినియా జపాన్‌, మలేషియా, న్యూజిలాండ్‌, ది ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, సౌత్‌కొరియా, థాయ్‌లాండ్‌, వియత్నాంలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 

ఈ కూటమి ఏర్పాటుపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులేవాన్‌ మాట్లాడుతూ ‘‘ఈ కూటమిలో భాగస్వాముల జీడీపీలు మొత్తం ప్రపంచ జీడీపీలో 40శాతానికి సమానం. ఈ కూటమిలో మరిన్ని దేశాలు చేరతాయని భావిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. ట్రంప్‌ హయాంలో బలహీనపడిన ఆర్థిక, సైనిక కూటములను వేగవంతంగా బలోపేతం చేసేందుకు బైడెన్‌సర్కారు ప్రయత్నిస్తోంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ప్రత్యామ్నాయంగా అమెరికా మిత్రదేశాల కోసం ఐపీఈఎఫ్‌ను ప్రారంభించినట్లు భావిస్తున్నారు. 

తైవాన్‌కు లభించని స్థానం ..

ఐపీఈఎఫ్‌ ట్రేడ్‌బ్లాక్‌ ఏర్పాటును చైనా తీవ్రంగా విమర్శించడాన్ని జాక్‌ సులేవాన్‌ తోసిపుచ్చారు. ఈ కూటమి ఏర్పాటు, నిర్వచనంలో ఎటువంటి గోప్యత లేదన్నారు. ఈ కూటమిలో తైవాన్‌కు స్థానం లభించలేదు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తైవాన్‌తో హై టెక్నాలజీ, సెమీకండెక్టర్లు, టెక్నాలజీ వంటి అంశాలపై సంబంధాలను మరింత బలోపేతం చేసుకొంటాము అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని