Weight Loss: నాలుగేళ్లలో 165 కిలోల బరువు తగ్గాడు!

దాదాపు 300 కిలోల కంటే ఎక్కువ బరువున్న నికోలస్‌  క్రాఫ్ట్‌  నాలుగేళ్లపాటు శ్రమించి  165కిలోల కేజీలు తగ్గాడు. బరువు తగ్గాలనుకుంటున్న ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

Published : 12 Mar 2023 01:43 IST

వాషింగ్టన్‌: బరువు తగ్గాలని (Weight Loss) చాలా మంది అనుకుంటారు.  ఆ   ప్రయత్నంలో భాగంగా  ప్రత్యేక ఆహార నియమాలు (Diet) పాటిస్తారు. అది కొద్దిరోజులు పాటిస్తారు. తర్వాత  కొన్ని రోజులకు అన్నీ అటకెక్కించి యధావిధిగా అన్నీ తినేస్తుంటారు. ఫలితంగా బరువు తగ్గడం మాట అటుంచి మరికొంత బరువు పెరుగుతుంటారు. కానీ, ఈ విషయంలో అమెరికాకు చెందిన నికోలస్‌ క్రాఫ్ట్‌ (Nicholas Craft) మాత్రం పలువురికి ఆదర్శంగా నిలిచి ఔరా అనిపించుకుంటున్నాడు.  ఎందుకంటే  దాదాపు 300 కిలోల కన్నా ఎక్కువ బరువున్న ఆయన.. నాలుగేళ్లపాటు కఠోర ఆహారనియమాలు పాటించి 165 కిలోల బరువు తగ్గాడు.  

నికోలస్‌ క్రాఫ్ట్‌ చిన్నప్పటి నుంచే అతడి అధిక బరువు సమస్యతో బాధపడుతుండేవాడు. హైస్కూల్‌లో చదివే రోజుల్లోనే దాదాపు 156 కిలోల బరువు ఉండేవాడు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అతడి బరువు పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా అనేక రకరకాల ఆరోగ్య సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి. మోకీళ్లతో పాటు, కండరాల నొప్పులు విపరీతంగా బాధించేవి. దీంతో  2019లో ఆయన డాక్టర్ని సంప్రదించాడు. అప్పటికి అతడి బరువు 300కిలోలకు పైమాటే. పరీక్షించిన వైద్యుడు క్రమంగా బరువు తగ్గాలని లేదంటే నాలుగైదేళ్లలో చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఆ రోజు నుంచే నికోలస్‌ బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. డాక్టర్ సలహాతో ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తూ, నిత్యం వ్యాయామం చేయడం ప్రారంభించాడు. దీంతో తొలి నెలలోనే దాదాపు 18 కిలోల మేర బరువు తగ్గాడు. అదే నియమాలను నాలుగేళ్లపాటు పాటించి 165 కిలోలు తగ్గినట్లు స్థానిక మీడియా సంస్థకు నికోలస్‌ వెల్లడించాడు.

‘‘ డిప్రెషన్‌ కారణంగా అతిగా తినేసేవాడిని. అందుకే విపరీతంగా బరువు పెరిగిపోయా. అందరితోపాటు ఉండలేకపోయా. నేను ప్రయాణించాలంటే ప్రత్యేకమైన వాహనాలు అవసరమయ్యేవి. బాగా లావుగా ఉండటం వల్ల ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆత్మన్యూనతాభావం వేధించేది. అందరితో కలవలేకపోతున్నా. బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమాలకూ వెళ్లేవాడిని కాదు. పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోయాను. ఆ సమయంలో డాక్టర్‌ ఇచ్చిన సలహాలతో సాధారణ మనిషిని కాగలిగాను.’’ అని నికోలస్‌ వెల్లడించారు. బరువు తగ్గకపోతే ప్రాణాలకే ప్రమాదమని ఆయన చెప్పిన మాటలే తనలో ఈ మార్పుకు కారణమని వివరించాడు నికోలస్. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు