US Navy: అమెరికా సముద్ర డ్రోన్‌ తస్కరణకు ఇరాన్‌ యత్నం..!

పర్షియన్‌ తీరంలో సోమవారం అర్ధరాత్రి అమెరికా-ఇరాన్‌ నౌకాదళాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అమెరికాకు చెందిన ఓ సముద్ర డ్రోన్‌ను ఇరాన్‌ నౌకలు చుట్టుముట్టి

Published : 01 Sep 2022 02:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పర్షియన్‌ తీరంలో సోమవారం అర్ధరాత్రి అమెరికా-ఇరాన్‌ నౌకాదళాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అమెరికాకు చెందిన ఓ సముద్ర డ్రోన్‌ను ఇరాన్‌ నౌకలు చుట్టుముట్టి అపహరించబోయాయి. కానీ, ఈ ప్రయత్నాలను అమెరికా దళాలు అడ్డుకొన్నాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పర్షియన్‌ గల్ఫ్‌లోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా నౌకలు ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ సహాయ నౌక షహిద్‌ బజిర్‌ అక్కడకు వచ్చింది. అమెరికా ఆధీనంలోని సముద్ర డ్రోన్‌(సెయిల్‌ డ్రోన్‌)ను అది నెట్టుకొంటూ అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. 

అదే సమయంలో దానికి సమీపంలో ఉన్న అమెరికా గస్తీ నౌక యూఎస్‌ఎస్‌ థండర్‌బోల్ట్‌ స్పందించింది. అప్పటికే ఇరాన్‌ నౌకకు డ్రోన్‌ను కట్టేశారు. కానీ, అమెరికా నౌకలోని నేరుగా ఇరాన్‌ నౌకలోని వారితో మాట్లాడారు. తక్షణమే ఆ డ్రోన్‌ను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతోపాటు అమెరికా గస్తీ నౌక కూడా ఆ డ్రోన్‌కు సమీపంలోకి వెళ్లింది. మరోపక్క బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్‌ నుంచి ఓ ఎంహెచ్‌60ఎస్‌ సీహాక్‌ హెలికాప్టర్‌ ఘటనా స్థలానికి బయల్దేరింది. అమెరికా దళాల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో చేసేది లేక ఇరాన్‌ నౌక ఆ  డ్రోన్‌ను వదిలేసింది. ఈ హైడ్రామా మొత్తం నాలుగు గంటలపాటు కొనసాగింది. ఓ పక్క ఇరాన్‌-అమెరికాల మధ్య అణుఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని