T20 World Cup 2024: ‘నేను సమస్యల్లో పడతానేమో’: టీ20ల్లో అమెరికా చేతిలో పాక్‌ ఓటమిపై మిల్లర్‌ వ్యాఖ్య

ప్రస్తుతం అగ్రదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ (T20 World Cup 2024) గ్రూప్‌ మ్యాచుల్లో పాకిస్థాన్‌కు అమెరికా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆ దేశ ప్రతినిధి సరదాగా స్పందించారు. 

Updated : 14 Jun 2024 13:55 IST

వాషింగ్టన్‌: టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup 2024)లో అతిథ్య దేశం అమెరికా చేతిలో పాకిస్థాన్ అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. దాంతో మిల్లర్, పాత్రికేయులకు మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది.

పాక్‌పై అమెరికా విజయానికి స్పందించాలంటూ మిల్లర్‌ను ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి ఆయన సరదాగా బదులిచ్చారు. ‘‘నాకు పెద్దగా తెలియని అంశాలపై మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతిసారి ఇబ్బందుల్లో పడుతుంటాను. ప్రస్తుతం మీరు అడిగిన పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌ అంశం కూడా ఆ కేటగిరీలోనిదే’’ అంటూ తనను ఆ విషయంలోకి లాగొద్దన్నట్లు సమాధానం ఇచ్చారు. క్రికెట్‌కు అంతర్జాతీయంగా విశేష ఆదరణ ఉన్నప్పటికీ.. ఆయన మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. భారత్‌, పాక్‌ వంటి దేశాల మాదిరిగా కాకుండా అమెరికా ఇప్పుడిప్పుడే క్రికెట్‌ వైపు ఆసక్తి పెంచుకోవడమే అందుకు కారణం. దానిలో భాగంగానే టీ20 వరల్డ్‌ కప్‌నకు ఆతిథ్యం ఇస్తోంది. అంతేగాకుండా ఆ జట్టు క్రికెటర్లు తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు.

యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ కూడా 159/3 స్కోరుతో సమం చేసింది. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. అయితే, పాక్‌ బౌలర్‌ ఆమిర్‌ వేసిన ఈ ఓవర్‌లో యూఎస్‌ఏ 18 పరుగులు సాధించింది. ఏడు పరుగులు వైడ్ల రూపంలోనే రావడం గమనార్హం. ఇదే తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమని పాక్ అభిమానులు నిరాశ చెందారు. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ 13 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో పాక్‌పై అద్భుత బౌలింగ్‌తో ‘సూపర్‌ ఓవర్‌’ విక్టరీని యూఎస్‌ఏకు అందించిన ముంబయి కుర్రాడు సౌరభ్‌ నేత్రావల్కర్‌ పేరు మారుమోగిపోయింది. 

భారత్, పాకిస్థాన్‌, యూఎస్‌ఏ, ఐర్లాండ్, కెనడా.. గ్రూప్‌ - Aలో తలపడుతున్న జట్లు. ఇప్పటికే వరుస విజయాలతో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. రెండు విజయాలతో అమెరికా రెండో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని