US: మారణహోమానికి పాల్పడిన వ్యక్తి టార్చ్‌ బేరరా..? ఇది సిగ్గుచేటు..!

బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారిని నియమిస్తూ చైనా తీసుకున్న నిర్ణయాన్ని అగ్రదేశం అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. ఇది సిగ్గుచేట్టు చర్య అంటూ తీవ్రంగా విమర్శించింది. 

Updated : 03 Feb 2022 12:01 IST

వాషింగ్టన్‌: బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారిని ఎంపిక చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయాన్ని అగ్రదేశం అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. ఇది చర్య సిగ్గుచేటు అంటూ తీవ్రంగా విమర్శించింది.

2020 జూన్‌లో భారత్‌-చైనా సరిహద్దులో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు ప్రాణనష్టం జరిగింది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ అధికారి కరనల్‌ క్వీ ఫాబోవాను.. వింటర్ ఒలింపిక్స్ టార్చ్‌ రిలేరన్‌ నిమిత్తం చైనా టార్చ్‌ బేరర్‌గా నియమించిందని గ్లోబల్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. బుధవారం వింటర్ ఒలింపిక్స్ రన్‌లో క్రీడా ప్రముఖులు, కొవిడ్ హీరోలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు.. ఇలా మొత్తం 130 మంది పాల్గొన్నారు. ఫాబోవా వీరిలో ఒకరు.  కాగా, ఈ చర్య బీజింగ్ క్రీడలను రాజకీయం చేస్తోందనడానికి స్పష్టమైన ఆధారం అంటూ నిపుణులు చెబుతున్నారు. తాజాగా దీనిపై అమెరికా స్పందించింది.  

‘2020లో భారత్‌పై దాడి చేసిన, వీగర్లపై మారణహోమానికి పాల్పడుతోన్న సైనిక కమాండర్‌ను బీజింగ్ ఒలింపిక్స్‌కు టార్చ్‌ బేరర్‌గా ఎంచుకోవడం సిగ్గుచేటు. వీగర్ల స్వేచ్ఛ కోసం, భారత సార్వభౌమాధికారానికి అమెరికా మద్దతు కొనసాగిస్తుంది’ అంటూ ట్విటర్‌లో స్పందించింది. ఇదిలా ఉండగా.. గల్వాన్ ఘటనలో భారత్ దాదాపు 20 మంది సైనికుల్ని కోల్పోయింది. చైనా మాత్రం ఇంతవరకు వాస్తవ సంఖ్య వెల్లడించలేదు. చైనాకు భారత్‌కు మించిన నష్టం జరిగిఉంటుందని తాజాగా ఆస్ట్రేలియా పత్రిక ది క్లాక్సన్‌లో కథనం వెలువడింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని