Jaishankar: పాక్‌కు అమెరికా ఎఫ్‌16 జెట్లు.. ఎవరిని ఫూల్స్‌ చేయాలనుకుంటున్నారు?

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌కు అమెరికా ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విక్రయించడాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.

Updated : 26 Sep 2022 18:30 IST

అగ్రరాజ్యంపై జైశంకర్‌ ఘాటు వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌కు అమెరికా ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విక్రయించడాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తప్పుబట్టారు. ఇస్లామాబాద్‌తో బంధం.. అమెరికాకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చబోదన్నారు. ఈ చర్యతో అమెరికా ఎవర్ని తెలివితక్కువ వారిని చేయాలనుకుంటోందని ప్రశ్నించారు.

అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్‌.. వాషింగ్టన్‌లో భారత-అమెరికన్‌ కమ్యూనిటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు.. అమెరికా ఎఫ్‌16 యుద్ధ విమానాల గురించి ఆయన స్పందించారు. కార్యక్రమంలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ అగ్రరాజ్య చర్యను విమర్శించారు. ‘‘ఇస్లామాబాద్‌తో బంధం వల్ల అమెరికా ఏం పొందుతుందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ బంధంతో అటు పాకిస్థాన్‌కు.. ఇటు యూఎస్‌ ప్రయోజనాలకు ఎలాంటి మేలు చేకూరదు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. కానీ, ఎఫ్‌16 వంటి అధునాతన యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు అందజేస్తే.. ఆ దేశం వాటిని ఎక్కడ మోహరిస్తుందో.. ఎలా ఉపయోగిస్తుందో అందరికీ తెలుసు. ఇలాంటి చర్యలతో ఎవరినీ ఫూల్స్‌ చేయలేరు’’ అని జైశంకర్‌ వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌కు 450 మిలియన్‌ డాలర్ల భారీ భద్రతా సహాయం అందిస్తూ జో బైడెన్‌ సర్కారు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ దేశానికి ఎఫ్‌16 యుద్ధ విమానాలను విక్రయించనుంది. అయితే ఈ నిర్ణయంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల వచ్చే ఉపద్రవాలను అమెరికా విదేశాంగ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని