H-1B Visa: మోదీ పర్యటన వేళ.. హెచ్‌-1బీ వీసాదారులు శుభవార్త విననున్నారా..?

ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ.. తమకు అనుకూలమైన నిర్ణయం ఏదైనా వెలువడుతుందా..?అని హెచ్‌-1బీ వీసాదారులు( H-1B visas) ఎదురుచూస్తున్నారు. వారు సంతోషించేలా బైడెన్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

Published : 22 Jun 2023 11:25 IST

వాషింగ్టన్‌: ప్రధాని మోదీ(PM Modi) అమెరికా పర్యటన నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐలకు శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తోంది. అక్కడ పనిచేస్తోన్న భారతీయులకు హెచ్‌-1బీ వీసాల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై గురువారం ప్రకటన వెలువడనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

హెచ్‌-1బీ వీసా( H-1B visas) పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేలా బైడెన్ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. దాంతో స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్‌ఆర్‌ఐలు తమ వీసాలను రెన్యువల్‌ చేసుకునేలా ఒక పైలట్‌ ప్రొగ్రామ్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం దీనికింద కొద్దిమంది విదేశీయులకు మాత్రమే అవకాశం కల్పించనున్నారని, తర్వాత ఈ ప్రొగ్రామ్‌ను మరింత విస్తరించనున్నారని సమాచారం.

అమెరికా (America) కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్‌-1బీ వీసా (H-1B visa) అవకాశం కల్పిస్తుంది. ఈ రకం వీసా వినియోగదారుల్లో మెజార్టీ వాటా భారతీయులదే. 2022 ఆర్థిక సంవత్సరంలో 4,42,000 మంది H-1B వీసా వినియోగదారుల్లో 73 శాతం మంది భారతీయులే ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. వీసా స్టాంపింగ్‌ కోసం ఆయా దేశాల్లోని అమెరికన్‌ కాన్సులేట్‌/ఎంబసీల్లో దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణకు, కొత్తగా పొందడానికి ఇంటర్వ్యూ కోసం ప్రస్తుతం సుదీర్ఘ కాలం వెయిటింగ్‌ ఉంటోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ స్వదేశానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉందని.. ఆయా దేశాల్లో వీసా అపాయింట్‌మెంట్‌లో చోటుచేసుకుంటున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌ఐలు శుభవార్త వినే అవకాశం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు