US President Biden: మీరు ఇలా రావాలి.. అలా వెళ్లాలి: బైడెన్‌కు సహాయకుల సూచనలు

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కార్యక్రమాలపై శ్వేతసౌధం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోందనే ప్రచారం జోరందుకుంది. 

Published : 08 Jul 2024 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ప్రస్తుత ప్రెసిడెంట్‌ జోబైడెన్‌ ఆరోగ్యంపై ఆందోళనకరమైన వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి ఆయన హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి ప్రవేశ ద్వారం, పోడియం, బయటకు వచ్చే మార్గాలకు సంబంధించిన కచ్చితమైన ఫొటోలు, మార్గ నిర్దేశకాలను సూచిస్తూ సహాయకులు ఓ కార్డును తయారుచేసి ఆయనకు అందిస్తున్నారు. ఇలాంటి కార్డును యాక్సియోస్‌ అనే పత్రిక చేజిక్కించుకొని తాజాగా కథనం వెలువరించింది. జూన్‌ 27న నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బైడెన్‌ పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షించిన తర్వాత నుంచి ఈ చర్యలు మొదలైనట్లు భావిస్తున్నారు. 

బైడెన్‌కు కార్యక్రమాల వేదికలు ఉన్న గదిలోకి ఎలా రావాలి.. ఎలా బయటకు వెళ్లాలో కూడా చెప్పాల్సి రావడంపై ఆయన సిబ్బందిలో ఒకరు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఆ వ్యక్తి గత 18 నెలల నుంచి ఆయనకు సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఒక చిన్న విరాళాల సేకరణ కార్యక్రమానికి కూడా నాటో సదస్సు స్థాయిలో హడావుడి చేయాల్సి వస్తోందన్నారు. 

జోబైడెన్‌ కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో ఆయన స్టాఫర్స్‌కు శ్వేతసౌధం నుంచి పెద్ద ఫొటోలతో కూడిన ఓ టెంప్లెట్‌ అందుతోంది. దీనిని ప్రెసిడెన్షియల్‌ అడ్వాన్స్‌ వర్క్‌గా అభివర్ణిస్తోంది. వీటిల్లో ‘వ్యూ ఫ్రం పోడియం’, ‘వ్యూ ఫ్రం ఆడియెన్స్‌’గా పేర్కొంటూ వేదిక చిత్రాల వంటివి కూడా ఉన్నాయి. మరోవైపు శ్వేతసౌధం ప్రతినిధి ఆండ్రూ బేట్స్‌ మాత్రం అధ్యక్షుడి కార్యక్రమాల్లో కచ్చితత్వం, సమగ్రత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అధ్యక్షుడు ఎవరైనా ఇవి తమ ప్రాథమిక చర్యలని వివరించారు. ఉపాధ్యక్షురాలి కార్యక్రమాల్లోను ఇవి ఉంటాయని వెల్లడించారు. మరోవైపు కమలాహ్యారిస్‌ ఆఫీస్‌ కూడా వీటిని ధ్రువీకరించింది. వీటిని స్టాండర్డ్‌ లాజిస్టికల్‌ బ్రీఫింగ్‌ మెటీరియల్‌గా వాటిని పేర్కొంది. ఉపాధ్యక్షురాలి కార్యక్రమాల్లో కూడా ఇవి వాడతామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని