Elon Musk: మస్క్‌ విదేశీ సంబంధాలను ఓ చూపు చూడొచ్చు.. బైడెన్‌ నర్మగర్భ వ్యాఖ్యలు

ట్విటర్లో సౌదీ అరేబియా పెట్టుబడులు కాకపుట్టిస్తున్నాయి. ఇప్పుడు ఆ సెగ మస్క్‌ను తాకింది. మస్క్‌ విదేశీ సంబంధాలను అమెరికా పరిశీలించే అవకాశం ఉంది.  

Published : 10 Nov 2022 11:20 IST

ఇంటర్నెట్‌డెస్క్: ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌కు ఇతర దేశాలతో ఉన్న సంబంధాల వల్ల.. జాతీయ భద్రతకు ఏమైనా ఇబ్బంది వాటిల్లుతుందేమో పరిశీలించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వాఖ్యానించారు. ట్విటర్‌ కొనుగోలులో సౌదీకి చెందిన ఓ సంస్థ నుంచి మస్క్‌ సాయం తీసుకోవడం దేశ భద్రతకు ముప్పా..? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బైడెన్‌ ఈ విధంగా స్పందించారు. ‘‘నాకు తెలిసి ఎలాన్‌ మస్క్‌కు ఇతర దేశాలతో ఉన్న సాంకేతిక సంబంధాలు, సహకారాల్లో సరికానివి ఏమైనా ఉన్నాయేమో అనే అంశం పరిశీలించదగినదే. కానీ అలాంటివి ఉన్నాయని నేను అనడంలేదు. పరిశీలించేందుకు అర్హమైనవని సూచిస్తున్నాను’’ అని బైడెన్‌ పేర్కొన్నారు. 

మస్క్‌ గత నెలలో సోషల్‌ మీడియా వేదిక ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకొన్నాడు. ఈ కొనుగోలుతో సౌదీ రాకుమారుడు అల్‌ వలీద్‌ బిన్‌ తలాల్‌ సంస్థ ట్విటర్‌లో రెండో అతిపెద్ద పెట్టుబడిదారుగా అవతరించింది. ఈ నేపథ్యంలో సెనెటర్లు రాన్‌ వేడన్‌, క్రిస్‌ మార్పీ.. ట్విటర్‌ డీల్‌ను పరిశీలించాలని కోరారు. సౌదీ అరేబియా పాలకులకు ఉన్న అణచివేత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ట్విటర్‌ ఖాతాదారుల సమాచారం, సందేశాలు వంటివి వారి చేతికి అందనీయకూడదన్నారు. రాజకీయ ప్రత్యర్థుల అణచివేతకు ఆ సమాచారం ఉపయోగించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని