USA: గ్రీన్‌కార్డుల దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు రేపేలా.. అమెరికా సిఫార్సులు

అమెరికాలో బ్యూరోక్రసీ జాప్యాల్లో చిక్కుకుపోయి నిరుపయోగంగా మారిన గ్రీన్‌కార్డులను పునర్వినియోగించేలా ఓ ప్రతిపాదన ముందుకొచ్చింది. 

Updated : 07 Jul 2023 20:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నో ఏళ్లుగా గ్రీన్‌కార్డు (green card) కోసం ఎదురు చూస్తున్న ఇండో-అమెరికన్లలో ఆశలు రేపే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ సభ్యులు, ఉద్యోగాల కేటగిరిలో 1992 నుంచి నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డులను స్వాధీనం చేసుకోవాలని.. ఆసియా అమెరికన్లు, హవాయిన్లు, పసిఫిక్‌ ద్వీపాలపై అమెరికా(USA) అధ్యక్షుడు జో బైడెన్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్న అజయ్‌ భుటోరియా సూచించారు. ఫలితంగా 1992-2022 వరకు జారీ చేసిన 2,30,000 ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏటా ఈ కేటగిరిలో జారీ చేసే 1,40,000 లక్షల కార్డులతో పాటు.. స్వాధీనం చేసుకొన్న వాటిల్లో కొన్నింటిని ప్రాసెస్‌ చేస్తారు. ‘‘నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డుల స్వాధీనం భవిష్యత్తులో ఈ కార్డుల వృథాను తగ్గిస్తుంది’’ అని అజయ్‌ పేర్కొన్నారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో ప్రాసెసింగ్‌ జాప్యాన్ని పరిష్కరిస్తుందన్నారు. దీంతోపాటు ఎన్నో ఏళ్లుగా గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి ఉపశమనం లభిస్తుందన్నారు.

ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం కుటుంబాలు, ఉద్యోగాల కోసం ఏటా కొన్ని ఇమ్మిగ్రెంట్‌ వీసాలు జారీ చేయడానికి కాంగ్రెస్‌ అనుమతులు జారీ చేసింది. కానీ, బ్యూరోక్రసీ జాప్యం కారణంగా వీటిల్లో కొన్ని అందుబాటులో ఉన్న గ్రీన్‌కార్డులను ఉపయోగించుకోలేకపోతున్నాయి. ఫలితంగా అవి నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డుల జాబితాలో చేరుతున్నాయని అజయ్‌ వివరించారు. దీనికి ఆయన రెండు పరిష్కారాలను సూచించారు. 1992-22 వరకు నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డులను.. వార్షిక కోటా కార్డులతోపాటు ప్రాసెస్‌ చేయడం వీటిల్లో ఒకటి.

ఇక రెండో పరిష్కార మార్గంగా.. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీతో కలిసి పనిచేసి కొత్త పాలసీని అమల్లోకి తీసుకురావాలి. దీని ప్రకారం ఏటా మంజూరయ్యే వార్షిక కోటా గ్రీన్‌ కార్డులను.. సదరు ఏజెన్సీలు తక్షణమే పేపర్‌ వర్క్‌ పూర్తిచేయకపోయినా.. అర్హులైన వలసదారులకు అందుబాటులో ఉంచాలి. 

దేశంలో గ్రీన్‌కార్డులు నిరుపయోగంగా ఉండటం వల్ల వ్యక్తులు, కుటుంబాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ సూచనలు చేసినట్లు అజయ్‌ వెల్లడించారు. గ్రీన్‌కార్డుల లభ్యత తక్కువగా ఉండటం వల్ల హెచ్‌1బీ వీసా(H-1B visas)లపై వచ్చే తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో ఆర్థిక వ్యవస్థకు వారి తోడ్పాటు పరిమితం కావడం, తాత్కాలిక ఉద్యోగుల పిల్లలకు 21 ఏళ్లు దాటంగానే ఇమ్మిగ్రేషన్‌ హోదా కోల్పోయే పరిస్థితి ఏర్పడటం వంటివి చోటు చేసుకొంటున్నాయన్నారు. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ వద్ద నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డులను స్వాధీనం చేసుకోవాలని 117వ కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనకు అనుగుణంగానే తన సిఫార్సులు ఉన్నాయని పేర్కొన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు