Published : 17 May 2022 10:57 IST

Green Cards: ఆరునెలల్లో గ్రీన్‌కార్డ్స్‌ దరఖాస్తుల ప్రాసెస్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో గ్రీన్‌ కార్డులు లేదా శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోపు ప్రాసెస్‌ చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సిఫార్సును ఆమోదం కోసం శ్వేత సౌధానికి పంపించనున్నారు. ఆసియా అమెరికన్లు, నేటివ్‌ హవాయిన్స్‌, పసిఫిక్‌ ఐలాండర్స్‌పై నియమించిన ఈ అడ్వైజరీ కమిషన్‌ సిఫార్సును అమలు చేస్తే.. గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న చాలా మంది ఇండో-అమెరికన్ల కల సాకారం కానుంది.

ఈ ప్రతిపాదనను ప్రముఖ ఇండో-అమెరికన్‌ నాయకుడు అజేయ్‌ జైన్‌ భుటోరియా అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్‌ మీటింగ్‌లో తెరపైకి తీసుకొచ్చారు. దీనికి కమిషన్‌లోని 25 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అమెరికాలో గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ పెండింగ్‌ను తగ్గించేందుకు వాటిని మరోసారి సమీక్షంచాలని కమిషన్‌ ‘అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌’కు సూచించింది. ఫ్యామిలీ గ్రీన్‌కార్డ్‌ అప్లికేషన్లు, డీఏసీఏ రెన్యూవల్స్‌, ఇతర గ్రీన్‌ అప్లికేషన్ల సమయాన్ని తగ్గించడం కోసం ఈ ప్రతిపాదనలు చేసింది.

గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలను కూడా వేగవంతం చేయడం కోసం ఈ కమిషన్‌ మరో సిఫార్సు చేసింది. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగమైన నేషనల్‌ వీసా సెంటర్‌ ఆగస్టు 2022 నుంచి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకొని మూడు నెలల్లోగా 100శాతం ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం  ఏప్రిల్‌ 2022 నాటికి ఉన్న 32,439 ఇంటర్వ్యూలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని.. వచ్చే ఏడాది ఇదే సమయం నాటికి 150 శాతం పెంచాలని పేర్కొంది. ఆ తర్వాత గ్రీన్‌కార్డుల ఇంటర్వ్యూ, వీసా ప్రాసెసింగ్‌కు కాలవ్యవధి ఆరునెలలు ఉండేట్లు చూసుకోవాలని కమిషన్‌ చెప్పింది.

అమెరికాలో వర్క్‌పర్మిట్లు ఇతర అంశాల విషయంలో యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌కు కూడా అడ్వైజరీ కమిషన్‌  కీలక సూచనలు చేసింది. వర్క్‌పర్మిట్లు, ట్రావెల్‌ డాక్యుమెంట్లు, తాత్కాలిక పొడిగింపులు ఇతర మార్పులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సిఫార్సు చేసింది. అమెరికాలో ఏప్రిల్‌ నాటికి 4,21,358 ఇంటర్వ్యూలు పెండింగ్‌లో ఉన్నాయని అజేయ్‌ జైన్‌ భుటోరియా వెల్లడించారు. మార్చిలో వీటి సంఖ్య 4,36,700గా ఉంది.

అమెరికా జనాభా సంఖ్య అనుకున్నంత వేగంగా పెరగడంలేదని అజేయ్‌ అభిప్రాయపడ్డారు. ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థలో మార్పులు లేకపోవడం కూడా దీనిలో మందగమనానికి కారణమవుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్‌ విధానాలు 1990లో అమల్లోకి తెచ్చారని.. ఆ తర్వాత వీటిల్లో పెద్ద మార్పులు చోటు చేసుకోలేదని ఆయన గుర్తు చేశారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని