India - Pak: భారత్‌-పాక్‌ ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తాం: అమెరికా

India - Pak: భారత్‌, పాక్‌ మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.

Published : 21 Jun 2024 08:10 IST

వాషింగ్టన్‌: భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు (India Pakistan Dialogue) తాము మద్దతిస్తున్నామని అమెరికా తెలిపింది. అయితే చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితిని ఇరు దేశాలే నిర్ణయించాలని పేర్కొంది. రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. భారత్‌, పాక్‌ రెండింటితోనూ బంధానికి అమెరికా విలువిస్తోందని అన్నారు.

మరో ప్రశ్నకు మిల్లర్ బదులిస్తూ.. ప్రాంతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా, పాక్‌ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా అందులో భాగమన్నారు. ఈ మేరకు పాక్‌ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామన్నారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు (India Pak Relations) పూర్తిగా క్షీణించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే విధానాన్ని వీడాలని భారత్‌ పదే పదే పాక్‌కు చెబుతోంది. ఆ తర్వాతే ఇరు దేశాల మధ్య చర్చలు, సత్సంబంధాలకు బాటలు పడతాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌ భద్రతకు ముప్పు తలపెట్టే కుటిల యత్నాలకు దిగుతోంది. ఇలా ఓవైపు హింసను ప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలకు పిలిస్తే తాము అంగీకరించేది లేదని భారత్‌ తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని వీడే వరకు చర్చలకు తావు లేదని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని