USA: భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. విచారణకు సహకరించాలని కోరిన విదేశాంగ శాఖ

కెనడాలోని ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో అమెరికా మెల్లిగా స్వరం పెంచుతోంది. దర్యాప్తునకు సహకరించాలని తాము భారత్‌ను అన్ని రకాలుగా అభ్యర్థించామని తాజాగా పేర్కొంది.

Updated : 26 Sep 2023 10:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా(Canada)లో ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను ప్రైవేటుగా, బహిరంగంగా అభ్యర్థించామని అమెరికా (USA) స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కచ్చితంగా జరగాలని.. దోషులకు శిక్షపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన రోజువారీ మీడియా సమావేశంలో మిల్లర్‌ మాట్లాడుతూ.. ‘‘కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలతో మేము తీవ్రంగా కలత చెందాం. మా కెనడా భాగస్వాములతో టచ్‌లో ఉన్నాం. దోషులకు శిక్షపడేలా కెనడా దర్యాప్తు కొనసాగడం ముఖ్యమని మేము భావిస్తున్నాం. ఈ దర్యాప్తునకు సహకరించాలని మేము భారత్‌ను బహిరంగంగా.. ప్రేవేటుగా అభ్యర్థించాం’’ అని వెల్లడించారు. ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.

దోషులను గుర్తించేందుకు దర్యాప్తు జరపాలి

ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో దోషులను గుర్తించేందుకు దర్యాప్తు జరపాల్సిందేనని కాలిఫోర్నియా ప్రతినిధుల సభ సభ్యుడు జిమ్‌ కోస్టా డిమాండ్‌ చేశారు. ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో స్పందిస్తూ.. ‘‘నిజ్జర్‌ హత్య విషయంపై నేను చాలా ఆందోళన చెందాను. దీనిపై అధికారిక బ్రీఫింగ్‌ కావాలని హౌస్‌ ఫారెన్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యుడిగా కోరాను. ఈ నేరంపై మనం కచ్చితంగా దర్యాప్తు చేపట్టి దోషులను బాధ్యులుగా చేయాలి’’ అని పేర్కొన్నారు.

భారత్‌ కీలక భాగస్వామే.. కానీ..!

మరోవైపు భారత్‌-కెనడా దౌత్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కెనడా ప్రభుత్వ ప్రకటనలతో ఖలిస్థానీలు పేట్రేగి పోతున్నారు. తాజాగా కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. వీటికి ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ సంస్థ నేతృత్వం వహిస్తోంది. భారత దౌత్యవేత్తను బహిష్కరించాలని ఆ సంస్థ ప్రతినిధి జతిందర్‌ సింగ్‌ గ్రేవాల్‌ కెనడాను డిమాండ్‌ చేశారు. మరోవైపు భారత దౌత్యకార్యాలయాల వద్ద బందోబస్తు పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని