IQ: బరువు పెరిగితే బుర్ర తగ్గుతుంది!

ఊబకాయం కారణంగా చిన్నారుల్లో మేధో సామర్థ్యం (ఐక్యూ) తగ్గే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

Published : 13 Jun 2024 06:28 IST

చిన్నారుల్లో ఐక్యూకు గండికొడుతున్న ఊబకాయం

వాషింగ్టన్‌: ఊబకాయం కారణంగా చిన్నారుల్లో మేధో సామర్థ్యం (ఐక్యూ) తగ్గే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల వారిలో మానసిక కుంగుబాటు సమస్య కూడా తలెత్తవచ్చని తేలింది. వాషింగ్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అధ్యయనంలో భాగంగా 9-11 ఏళ్ల మధ్య ఉన్న 5వేల మంది చిన్నారులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారిలో మానసిక విషయగ్రహణ సామర్థ్యాన్ని విశ్లేషించారు. ఈ పిల్లల ప్రాథమిక డేటాను 2016 జూన్‌ నుంచి 2018 అక్టోబరు మధ్య సేకరించారు. అనంతరం రెండేళ్ల పాటు వారి తీరుతెన్నులను పరిశీలించారు. వారి శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ), నడుం చుట్టుకొలత వంటి అంశాలను సేకరించారు. వారికి మానసిక సామర్థ్యానికి సంబంధించిన ఒక పరీక్ష పెట్టారు. ఆరోగ్యకర బరువు కలిగినవారితో పోలిస్తే బీఎంఐలో ఏటా 1.6 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నవారు మానసిక సామర్థ్య పరీక్షలో ఒక పాయింట్‌ మేర తక్కువ స్కోరు సాధించినట్లు గుర్తించారు. బీఎంఐ అధికంగా ఉండటం వల్ల కుంగుబాటు సమస్య కూడా కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 

ఇవీ కారణాలు.. 

చిన్నతనంలో ఊబకాయం రావడానికి అనేక కారణాలు ఉన్నాయని అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) చెబుతోంది. ఇందులో జీవక్రియ, ఆహారం, శారీరక శ్రమ తీరుతెన్నులు, తక్కువ నిద్ర వంటివి ఉన్నాయి. ఊబకాయానికి సంబంధించిన జన్యు అంశాలను మార్చడం సాధ్యం కాదు. అయితే చిన్నారులు ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉండేలా చూడటానికి వ్యక్తులు, ప్రదేశాల పాత్ర ఉంటుంది. పిల్లలు ఎక్కువ సమయం గడిపే ఇళ్లు, పాఠశాలలు వంటి చోట్ల పోషకాహారం అందుబాటులో ఉండేలా చూడటం, వారిని శారీరకంగా చురుగ్గా ఉంచే ఏర్పాట్లు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని సీడీసీ తెలిపింది. చిన్నారులు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేలా చూడాలని, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు తక్కువగా తీసుకునేలా పాఠశాలలు కొన్ని విధానాలను రూపొందించాలంది. పిల్లలను శారీరకంగా చురుగ్గా ఉంచే సమయాన్ని కూడా పెంచాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని