Spy balloon: మినిట్‌మ్యాన్‌-3 అణుక్షిపణులపై చైనా నిఘా.. బెలూన్‌ పేల్చివేత!

అమెరికా అణు క్షిపణి స్థావరం మధ్యలో చైనా కమ్యూనికేషన్‌ టెక్నాలజీ వాడుతున్నారు. ఇప్పుడు చైనా బెలూన్‌ ఒకటి నిఘా పరికరాలతో అక్కడకు చేరుకొని రోజుల తరబడి ఉంది. తాజాగా దాన్ని అమెరికా యుద్ధవిమానం కూల్చివేసింది.

Updated : 05 Feb 2023 14:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China)-అమెరికా(USA) మధ్య ఓ బెలూన్‌ కొత్త చిచ్చుపెట్టింది. ఇటీవల అమెరికా(USA) ఉత్తర భాగంలో అణుక్షిపణులను భద్రపర్చిన మోంటానాపై ఓ హైఆల్టిట్యూడ్‌ నిఘా బెలూన్‌ కలకలం సృష్టించింది. దీనిని అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూల్చివేశారు. ఇందుకోసం అమెరికా(USA) అత్యాధునిక విమానం ఎఫ్‌-22 ఫైటర్‌ను రంగంలోకి దించింది. ఈ ఫైటర్‌ జెట్‌ ఎయిర్‌ ఇంటర్‌సెప్ట్‌ క్షిపణి 9ఎక్స్‌ సైడ్‌విండర్‌ను ప్రయోగించి బెలూన్‌ను పేల్చివేసింది. అమెరికా(USA) తీరానికి ఆరు నాటికల్‌ మైళ్ల అట్లాంటిక్‌ సముద్రంపై ఇది చోటు చేసుకొంది.  ఈ బెలూన్‌ శకలాలు దక్షిణ కరోలినాలోని మిర్టిల్‌ బీచ్‌ సమీపంలో దాదాపు ఏడు మైళ్ల విస్తీర్ణంలో 47 అడుగుల నీటి లోతులో పడ్డాయి. ప్రస్తుతం అమెరికా సైన్యం ఆ శకలాలను సేకరించే పనిలో పడింది. ఓ భారీ క్రేన్‌తో కూడిన రెండు నౌకాదళషిప్‌లు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి.

చైనా ఉపగ్రహాలకు సమాచారం ..?

సాధారణంగా ప్రయాణికులను తీసుకెళ్లే విమానాలు భూమికి 40 వేల అడుగుల(12 కిమీ) ఎత్తులో ప్రయాణిస్తాయి. అదే ఫైటర్‌ జెట్‌ విమానాలు 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. ఇక నిఘా బెలూన్లు అత్యంత తేలికైన హీలియం వాయువుతో నిండి ఉండటంతో ఇవి భూమికి 24 కిమీ నుంచి 37 కిమీ ఎత్తులో ప్రయణిస్తాయి. ఈ బెలూన్‌లో సోలార్‌ ప్యానల్స్‌ ఉంటాయి. కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్‌ పరికరాలను కూడా అమర్చుతారు. సాధారణంగా నిఘా బెలూన్‌ నుంచి సేకరించిన సమాచారం బేస్‌కు చేర్చాలంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. 1960 తొలినాళ్లలోని నిఘా ఉపగ్రహాలు జారవిడిచే సమాచారాన్ని ఒడిసి పట్టుకోవడానికి అమెరికా(USA) ప్రత్యేకమైన టెక్నాలజీని తయారు చేసింది. దీనిని సీ-130 విమానాల్లో అమర్చి వినియోగించేవారు. అటువంటి వ్యవస్థను ఈ బెలూన్‌ విషయంలో చైనా (China) వాడాలంటే అమెరికా గగనతలంపై భారీ పరిమాణంలోని చైనా(China) విమానం ఎగరాలి. లేదా సేకరించిన సమచారాన్ని పారాచూట్‌ ద్వారా భూమిపైకి జారవిడవాలి. మోంటానా ప్రాంతంలో వాటిని కలెక్ట్‌ చేసుకొనేందుకు చైనీయులు ఉండాలి. ఇది కూడా చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే బెలూన్‌లో అమర్చిన రేడియో పరికరాల ద్వారా చైనా ఉపగ్రహాలకు సమాచారాన్ని ప్రసారం చేసే అవకాశం ఉందనే అనుమానాలు ఉన్నాయి. ట్రంప్‌ హయాంలో కూడా మూడు చైనా నిఘా బెలూన్లు అమెరికాపై ఎగిరినట్లు అధికారులు చెబుతున్నారు. 

అమెరికా(USA) అణుస్థావరాల వద్ద చైనా(China) టెలికాం టెక్నాలజీ

మోంటానా రాష్ట్రం మధ్యలో మాల్మ్‌స్ట్రోమ్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ ఉంది. ఇది అక్కడి మైదానాల్లోని 13,800 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. అక్కడే అమెరికా(USA)కు చెందిన స్ట్రాటజిక్‌ కమాండ్‌ (అణ్వాయుధ కమాండ్‌) అధీనంలోని 100 మినిట్‌మ్యాన్‌-3 క్షిపణులను బొరియల్లో (సిలోస్‌) ఉంచారు. ఈ బొరియలు ఒకదానికి మరొకటి దూరంగా ఉంటాయి. ఈ క్షిపణులు 6,000 మైళ్ల దూరంలోని లక్ష్యాలను నిమిషాల్లో చేరుకోగలవు.  క్షిపణులను ఉంచిన బొరియల మధ్యలో అమెరికా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఆపరేటర్‌కు చెందిన సెల్‌ఫోన్‌ టవర్లు ఉన్నాయి. ఈ టవర్లలో చైనాకు చెందిన హువావే కంపెనీ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ నెట్‌వర్క్‌ సాయంతో చైనా ఇక్కడి సైనిక స్థావరాల కదలికల కీలక ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరిస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. వాస్తవానికి హువావేను అమెరికాలోని పెద్ద కంపెనీలు ఇప్పటికే పక్కన పెట్టినా.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల చౌకబారు హువావే పరికరాలను టవర్లలో వినియోగిస్తున్నారు. ఇప్పుడు అక్కడే చైనా నిఘా బెలూన్‌(Chinese spy balloon) రోజుల తరబడి ఎగరడం గమనార్హం.  

అమెరికా(USA) ప్రాదేశిక జలాలను దాటనీయకుండానే..

ఈ ఘటనపై పెంటగాన్‌ స్పందించింది. తాము కూల్చేసిన చైనా(China) నిఘా బెలూన్‌(Chinese spy balloon)లో అమర్చిన పరకరాలను సేకరించి విశ్లేషిస్తామని పేర్కొంది. చైనా నిఘా బెలూన్‌ నుంచి వచ్చే ముప్పును తప్పించడానికి తగినన్ని చర్యలు తీసుకొన్నామన్నారు. అమెరికా పై నుంచి ప్రయాణించిన ఆ బెలూన్‌లో కీలక నిఘా సమాచారం ఉంది. దీనిపై అమెరికా(USA) అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందిస్తూ ‘‘నాకు బెలూన్‌(Chinese spy balloon) గురించి  సమాచారం తెలియగానే వీలైనంత తర్వగా దానిని కూల్చివేయమని ఆదేశించాను. దాని శకలాల కారణంగా భూమిపై వారికి నష్టం జరుగుతుందేమోనన్న అనుమానంతో వేచి చూశారు. అది భూభాగం దాటి సముద్రంపైకి వెళ్లిన వెంటనే 12 నాటికల్‌ మైళ్లలోపే(అమెరికా ప్రాదేశిక జలాల పరిధిలోనే) కూల్చివేయాలని నిర్ణయించారు. దాన్ని విజయవంతంగా అమలు చేశారు. మా ఏవియేటర్లను అభినందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 

ఈ భారీ బెలూన్‌(Chinese spy balloon) తొలుత జనవరి 28న అమెరికా(USA)లోని అలూటియాన్‌ గగనతలంలో కనిపించింది. ఆ తర్వాత కెనడా గగనతలంలో ప్రవేశించింది. తిరిగి మూడు రోజులకు అమెరికా గగనతలంపై ఎగురుతూ కనిపించింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ స్పందిస్తూ ఇది చైనా(China) బాధ్యతా రాహిత్యమైన చర్య అని అభివర్ణించారు. 

తగిన ప్రతిస్పందన ఉంటుంది..: చైనా

అమెరికాలో నిఘా బెలూన్‌(Chinese spy balloon) కూల్చివేతపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై తగిన ప్రతిస్పందన ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన వెలువరించింది. అది పౌర వినియోగం కోసం వాడే బెలూన్‌ అని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని