USA: జపాన్‌ బాలికపై అమెరికా సైనికుడి అత్యాచారం: మరోసారి ఒకినావా స్థావరంపై విమర్శలు

జపాన్‌లో ఒకినావాలోని అమెరికా సైనిక స్థావరంపై మరోసారి తీవ్ర స్థాయి విమర్శలు చెలరేగాయి. అక్కడ అమెరికా సైనికుడు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

Updated : 26 Jun 2024 17:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA) సైన్యం జపాన్‌(Japan)లోని ఒకినావా దీవిలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అక్కడ ఓ బాలికపై అగ్రరాజ్య సైనికుడు అత్యాచారం చేయడంతో స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అతడిని అదుపులోకి తీసుకొన్న జపాన్‌ అధికారులు తాజాగా నేరాభియోగాలు నమోదుచేసినట్లు వెల్లడించారు. 

2023 డిసెంబర్‌ 24న ఓ అమెరికా సైనికుడు విధి నిర్వహణ ముగించుకొన్న సమయంలో స్థానిక పార్క్‌లో జపాన్‌కు చెందిన బాలికతో మాట్లాడాలి కారులోకి రమ్మని పిలిచాడు. ఆమె అందులోకి రాగా.. తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయంపై బాలిక కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి ఈ ఏడాది మార్చిలో అదుపులోకి తీసుకొని నేరాభియోగాలను నమోదు చేశారు. తాజాగా ఈ విషయాన్ని జపాన్‌ ప్రభుత్వ ప్రతినిధి హయాషీ బహిర్గతం చేశారు. దర్యాప్తు బృందాలకు ఆ దేశ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. స్థానిక అమెరికా రాయబారి వద్ద కూడా జపాన్‌ అధికారులు ఫిర్యాదు నమోదు చేశారు. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవాలని కోరారు. ఇలాంటివి ఇరుదేశాల మధ్య అపనమ్మకాన్ని పెంచుతాయని ఒకినావా గవర్నర్‌ డెన్నీ టమాకీ పేర్కొన్నారు. 

ప్రపంచంలో అమెరికాకు విదేశాల్లో ఉన్న అతిపెద్ద సైనిక స్థావరం ఒకినావా. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌ను ఓడించిన తర్వాత దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ 30,000 మందికిపైగా సిబ్బంది విధుల్లో ఉంటారు. తైవాన్‌పై చైనా దాడి చేస్తే.. ఈ స్థావరమే దానిని అడ్డుకొనేందుకు తొలుత స్పందించాల్సి ఉంటుంది. 

  • గతంలో కూడా ఇక్కడ అమెరికా సైనికులు చేసిన తప్పుడు పనులపై స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేసిన సందర్భాలున్నాయి. 1955లో అమెరికా సైనిక సిబ్బంది వారాల వ్యవధిలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగారు.   
  • ఇక్కడ 1959లో కదాన్‌ ఎయిర్‌ బేస్‌కు చెందిన ఎఫ్‌-100 ఫైటర్‌ విమానం ఎలిమెంటరీ స్కూల్‌పై పడిపోవడంతో దాదాపు 17 మంది చనిపోగా.. 210 మంది గాయపడ్డారు. నాడు కూడా స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగారు.
  • 1970లో ఒకినావా నగరంలో మూడువేల మంది స్థానికులకు, అమెరికా మిలటరీ పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. అగ్రరాజ్య సైనిక వాహనం చేసిన రోడ్డు ప్రమాదమే దీనికి కారణం.  
  • 1995లో అమెరికా మెరైన్‌ ఒకరు 12 ఏళ్ల స్థానిక బాలికను అపహరించి.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది అతిపెద్ద ఆందోళనలకు కారణమైంది. నిందితుడిని జపాన్‌లోనే శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. 80,000 మంది నాటి ఆందోళనలో పాల్గొనడంతో అంతర్జాతీయ సమాజం దృష్టి దీనిపై పడింది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని