Updated : 25 Jun 2022 00:45 IST

US: అబార్షన్‌ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు

వాషింగ్టన్‌: అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దాదాపు యాభై ఏళ్లుగా అమలులో ఉన్న అబార్షన్ హక్కులకు సంబంధించి రాజ్యాంగ రక్షణలకు ముగింపు పలికింది. ‘‘రాజ్యాంగం అబార్షన్ హక్కును కల్పించలేదు. రో, కేసీ కేసులో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం. అబార్షన్‌కు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలకే తిరిగి దక్కుతుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అబార్షన్‌ను నియంత్రించేలా రాష్ట్రాలు ఇకపై చట్టాలు, అధికారాలు చేయవచ్చని స్పష్టం చేసింది.

అమెరికాలో 1973లో ‘రో వర్సెస్‌ వేడ్’ కేసులో మహిళలు అబార్షన్‌ చేయించుకోవడాన్ని రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ గతంలో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీంతో ఆనాటి నుంచి అక్కడ అబార్షన్లు చట్టబద్ధమయ్యాయి. అయితే నియంత్రణ లేని అబార్షన్లు, మహిళల ఆరోగ్యంపై ప్రభావంపై అమెరికాలోని కొన్ని వర్గాలు గత కొన్నేళ్లుగా పోరాడుతున్నాయి. అబార్షన్‌ హక్కును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

మరోవైపు అబార్షన్లపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొంతమంది హర్షం వ్యక్తం చేయగా.. మరికొంత మంది విభేదిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది అమెరికన్లు సుప్రీంకోర్టు ఎదుట గుమిగూడారు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికే సుమారు 25 నుంచి 50 రాష్ట్రాలు అబార్షన్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం అబార్షన్‌ను నిషేధించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. మరోవైపు ఈ తీర్పుపై అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందించారు. ఈ రోజు కోర్టుకు, అమెరికాకు చాలా విచారకరమైన రోజు అని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ హక్కును ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ రోజు మహిళల ఆరోగ్యం, జీవితం ప్రమాదంలో పడింది అని పేర్కొన్నారు.  

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts