Flights To China: ఫ్లైట్‌ ఫైట్‌.. చైనాకు షాక్‌ ఇచ్చిన అమెరికా!

కరోనా నియంత్రణ విషయంలో ‘జీరో కొవిడ్‌’ విధానాలతో చైనా కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలు విధిస్తోంది. ‘సర్క్యూట్‌ బ్రేకర్‌’ విధానంతో విమానాల రాకపోకలను కట్టడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాకు...

Published : 23 Jan 2022 01:41 IST

వాషింగ్టన్‌: కరోనా నియంత్రణ విషయంలో ‘జీరో కొవిడ్‌’ విధానాలతో చైనా కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలు విధిస్తోంది. ‘సర్క్యూట్‌ బ్రేకర్‌’ విధానంతో విమానాల రాకపోకలను కట్టడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాకు చెందిన విమాన సర్వీసులను రద్దు చేసింది. అయితే, డ్రాగన్‌ చర్యకు దీటుగా.. అమెరికా సైతం ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 చైనా విమానాలను నిలిపేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఒక రూట్‌లో వస్తున్న విమానాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు వస్తుంటే.. దాన్ని నిలిపేయడమే చైనా ‘సర్క్యూట్‌ బ్రేకర్‌’ విధానం అమలు తీరు. దీంతోనే చైనా ఏవియేషన్ అథారిటీ.. అమెరికాకు చెందిన అమెరికన్, డెల్టా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాలను రద్దు చేసింది.

చైనా తీరుపై అమెరికా రవాణా విభాగం కూడా గట్టిగానే స్పందించింది. తమ విమానయాన సంస్థల కార్యకలాపాలను దెబ్బతీసేలా తీసుకున్న ఈ చర్యలు.. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమైనవని పేర్కొంది. తమ విమానాలు అన్ని ప్రొటోకాల్స్‌ పాటిస్తోన్నట్లు తెలిపింది. సంబంధిత ప్రయాణికులకు అమెరికాలో టేకాఫ్‌కు ముందు నెగెటివ్‌గానే తేలుతోందని, చైనాలో దిగాక పాజిటివ్‌గా నిర్ధరణ అయితే.. చర్యలు తీసుకోవడం తగదని పేర్కొంది. ఇందుకు ప్రతిచర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. జనవరి 30- మార్చి 29 మధ్య షెడ్యూల్‌ అయిన ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, షియామెన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 44 విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌ మొదలుకానున్న తరుణంలో.. అమెరికా ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు